YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుంగభధ్ర ఇసుక అక్రమాల్లో 3 వాటాలు అందరూ దొంగలే

 తుంగభధ్ర ఇసుక అక్రమాల్లో 3 వాటాలు అందరూ దొంగలే
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తుంగభద్ర నది ఇసుకకు ప్రధాన వనరు. నది పొడవునా మంత్రాలయం, చెట్నెహళ్లి, మాధవరం, కాచాపురం, రాంపురం గ్రామాలు ఉన్నాయి. సరైనా పరిమాణంలో ఇసుక లేకపోవడంతో ప్రభుత్వం ఇసుక రీచ్‌ ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా చేసుకున్న అధికార పార్టీ నేతలు ఇసుక అక్రమ తరలింపునకు కొత్తగా జత కట్టారు. మంత్రాలయం కేంద్రంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళిక రచించారు. ఇసుక తరలింపు మాఫియా ఓ చోట సమావేశమై మామూళ్ల కథను బయటకు తెచ్చారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, పాత్రికేయులు నోళ్లు మూయించేందుకు వాటాల వేడుక తెచ్చారు. ఇసుక మాఫియా వ్యూహ రచనలో టీడీపీ మండల అధ్యక్షుడు పన్నగ వెంకటేష్‌ ప్రధాన భూమిక పోషించినట్లు సమాచారం. ఇంట్లో మాఫియాతో సమావేశమై వాటాల బాగోతం తెరపైకి తెచ్చారు. ఇసుక ట్రాక్టర్‌కు నెలకు రూ.3 వేలు చొప్పున చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. జమ చేసిన నగదును మూడు భాగాలుగా విభజించి వాటాలు పంచేలా నిర్ణయించారు. రెండు నెలలుగా ఈ తంతు సాగుతూ వస్తోంది. పన్నగ వెంకటేష్‌ రెండు శాఖల అధికారులతో సంప్రదించి అక్రమ రవాణాకు గ్రీన్‌సిగ్నల్‌ పలికారు అన్నది బహిరంగ రహస్యం. అధికార దర్పంతో మాఫియా అంతా ఏకమై వాటాల పర్వం సాగిస్తోంది. మంత్రాలయం మండలం, పరిసర గ్రామాలకు చెందినవి 30 ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్ల నెల వసూలు రూ.90 వేలు. అందులో రెవెన్యూ శాఖకు రూ.30, పోలీస్‌స్టేషన్‌కు రూ.30, పాత్రికేయులకు రూ.30 వేలు చొప్పున వాటాలుగా ముట్టజెప్పుతున్నారు. ఈ వ్యూహంలో కల్లుదేవకుంట ట్రాక్టర్‌ యజమానులు సైతం కీలకపాత్ర పోషించారు.ఇసుకను ప్రధానంగా ఎమ్మిగనూరు పట్టణానికి తరలిస్తున్నారు. మంత్రాలయం కేంద్రంలో ఇసుక ట్రాక్టర్‌ రూ.1200 చొప్పున విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూరు రూ.3–4 వేలుకు టిప్పు అమ్ముకుంటూ అక్రమార్జన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేకున్నా మాఫియా సంపాదన మాత్రం రూ.కోట్లు మించిపోవడం విశేషం. వాల్టా చట్ట ప్రకారం విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, చెట్లు నరికి వేయడం చేయరాదు. ప్రభుత్వ అనుమతులతోనే తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టాలి. చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులే కాసులకు దాసోహమయ్యారు. వాటాలతో సరిపెట్టుకుని దాడులకు చెల్లుచీటి ఇచ్చారు. కళ్లేదుట, కార్యాలయాల ఎదుట వందల కొద్దీ ట్రాక్టర్లలో ఇసుక తరలుతున్నా పట్టించుకోవడం లేదు. ఇసుక దందాపై నిట్టూరుస్తున్నారు. సామాన్యులు ఇసుక కోసం నానా అవస్థలు పడుతుంటే.. ఇసుక మాఫియాకు మాత్రం దారులు సుగమం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్త మవుతున్నాయి. 

Related Posts