యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతికి రావాలని ముఖ్యమంత్రి నుంచి సందేశం అందింది. శాసనసభ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థిత్వం ఎంపికకు సంబంధించి ఈనెల 29న అమరావతిలో నియోజకవర్గ ముఖ్యనేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కానున్నారు. ఈమేరకు 29వ తేదీ తనను కలవాల్సిందిగా నియోజకవర్గంలోని నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలకు మాత్రమే ఆహ్వానాలు అందినట్టు సమాచారం. ఈ భేటీలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కూడా ఖరారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫైనల్‌గా రాజంపేట నియోజకవర్గంలో సామాజిక కోణంలోనే అభ్యర్థిత్వం ఖరారు చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇందులో బలిజ, రాజు సామాజికవర్గం నుండే అభ్యర్థిత్వంపై పరిశీలన జరిపినా, బలిజ సామాజికవర్గం వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతుంది. ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీలు ఈ సామాజికవర్గం నుండి పార్టీ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా బలిజ సామాజికవర్గం అభ్యర్థిత్వం ఎంపిక జరిగితే నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తల మనోభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై ముఖ్యమంత్రి నియోజకవర్గ నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజంపేట దేశం అభ్యర్థిత్వాన్ని ఈ నెలలోపే ఖరారు చేసే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే 29వ తేదీ రాజంపేట నేతలతో బాబు జరిపే చర్చల్లోనే అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.