ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించిన భారత్.. న్యూజిలాండ్ గడ్డ మీద కూడా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. వరుసగా మూడు వన్డేలు గెలిచిన కోహ్లి సేన మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. వన్డే సిరీస్‌ను గెలుపొందింది. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన భారత్.. కివీస్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో కెప్టెన్‌గా కోహ్లి అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. 63 వన్డేల్లో విరాట్ జట్టుకు నాయకత్వం వహించగా.. 47 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందింది. 63 వన్డేల్లో సారథ్యం వహించిన అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. 50 విజయాలతో క్లైవ్ లాయిడ్, రిక్కీ పాంటింగ్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. అత్యధిక విజయాల శాతం ఉన్న కెప్టెన్లలో కోహ్లి (74.60 శాతం) రెండోస్థానంలో నిలిచాడు. క్లైవ్ లాయిడ్ (64/84) 76.19 విజయాల శాతంతో నంబర్ వన్‌గా ఉన్నాడు. హ్యాన్సీ క్రోనే (99/138 - 71.74 శాతం), రికీ పాంటింగ్ (165/230 - 71.74 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్ గడ్డ మీద వన్డే సిరీస్ విజయంతో.. ఇంగ్లాండ్ మినహా ఆడిన అన్ని దేశాల్లోనూ కోహ్లి వన్డే సిరీస్ నెగ్గాడు. జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కోహ్లి జట్టును గెలిపించాడు. కోహ్లి సారథ్యంలోని భారత జట్టు గతేడాది చివర్లో ఇంగ్లాండ్ పర్యటించింది. కానీ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఓడింది. పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉంటోంది. చివరిసారిగా 2015లో ధోనీ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో భారత్ వన్డే సిరీస్ ఆడింది.