యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలోని ప్రతి గ్రామం స్మార్ట్ గ్రామంగా అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కొమరవోలు గ్రామంలో జరిగిన అభివృద్ధిని తాను స్వయంగా చూశానని, అదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్ల్లో అభివృద్ధి జరిగితే స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ‘స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్’ ఎంపిక చేసిన అత్యుత్తమ ‘స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు’ భాగస్వాములను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం సచివాలయంలో ఘనంగా సత్కరించారు.
ఇటీవల ‘జన్మభూమి-మాఊరు కార్యక్రమం’ సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం సి. కుటుంబరావు, డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డాక్టర్ బి. గంగయ్య సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ 17 మంది అత్యుత్తమ ‘స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు’ భాగస్వాముల్ని ఎంపిక చేసింది. వీరందరినీ అమరావతికి పిలిపించిన ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశం చివర్లో ఘనంగా సత్కరించారు. వీరంతా వారు దత్తత తీసుకున్న గ్రామాలు, వార్డులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. త్రిసభ్య కమిటీ ఎంపిక చేసిన 17 మంది ‘స్మార్ట్’ భాగస్వాములలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (నర్సింపల్లి), రాష్ట్రీయ సేవా సమితి (మమందుర్), ఎస్కె అబ్దుల్ అలీ (దీనదారుపల్లె), తోట నరసింహం (బూరుగుపూడి), నాట్కో ట్రస్టు (గొల్లంపూడిపాడు), ఆనంద్ కూచిభోట్ల (కూచిపూడి), టాటా ట్రస్ట్స్ (265 గ్రామ పంచాయతీలు), రామోజీ ఫౌండేషన్ (పెదపారుపూడి), మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డోకిపర్రు), ఎ. రవికృష్ణ (కప్పట్రాళ), ఎంవీ శివకుమార్రెడ్డి (పోలూరు), సెయంట్ టెక్నాలజీస్ (మోక్షగుండం), అరబిందో ఫార్మా (పెయ్యలపాలెం), దివీస్ లాబొరేటరీస్ (చిప్పాడ, మంతెన), శర్ధ మెటల్స్ అండ్ అల్లాయిస్ (కంటకపల్లి), విష్ణుప ఎడ్యుకేషనల్ సొసైటీ (కె. అన్నవరం), కే. విజయానంద్ (ఎస్.ఉప్పలపాడు) ఉన్నారు.