యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
పాపం పవన్ కల్యాణ్. అన్నిపార్టీలు, ప్రముఖ నాయకులు కలిసికట్టుగా జనసేన గొంతు నొక్కేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఏపీ రాజకీయాల్లో చిన్నపార్టీగానే జనసేన ను చెప్పుకోవాలి. అయితే జనాకర్షణ కలిగిన సెలబ్రిటీ నాయకత్వం వహించడం, ఒక సామాజిక వర్గం సొంతం చేసుకునే వాతావరణం దానికి కలిసొస్తున్నాయి. అందుకే ఈ పార్టీ తమ ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగిస్తుందోననే అనుమానం ప్రధాన పార్టీలను వెన్నాడుతోంది. మొగ్గలోనే పార్టీని తుంచేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంటున్నారు పరిశీలకులు. పవన్ కల్యాణ్ కు రాజకీయ చాకచక్యం అంతంతమాత్రమే. అతనికి సలహాలిచ్చేవారి సంఖ్య అంతంతమాత్రమే. ఒక నియమిత సంఖ్యలో, పరిధిలో మాత్రమే రాజకీయ మిత్రులతో సమావేశమయ్యే పవన్ విస్తృతమైన అవగాహనను ఇంకా ఏర్పరచుకోలేదు. ఈలోపుగానే పార్టీపరంగా ఉన్న బలహీనతలను అడ్డుగా పెట్టి జనసేన అస్తిత్వాన్ని అయోమయం చేయాలని చూస్తున్నాయి ప్రధానపార్టీలు. పొలిటికల్ టాక్టిక్స్ లో వెనకబడుతున్న జనసేన పుట్టి ముంచే ఏర్పాట్లు చేస్తున్నాయి రాటుతేలిన నాటు పార్టీలుతెలంగాణ రాష్ట్రసమితి జనసేనకు స్నేహహస్తం అందిస్తోంది. వీలుంటే వైసీపీతో కలవమని సూచిస్తోంది. లేకపోతే స్వతంత్రంగా పోటీ చేసినా తాము సహకారం అందిస్తామంటూ అగ్రనాయకత్వం అభయమిస్తోంది. కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రధాన భూమిక పోషించాలనుకుంటున్నారు. జనసేన కూడా ఏపీలో ప్రధాన పార్టీల్లో ఒకటిగా నిలిస్తే ఫెడరల్ ఫ్రంట్ కూటమిలో చేర్చుకోవచ్చనే భావనలో ఉంది టీఆర్ఎస్ అగ్రనాయకత్వం. ఒకవేళ ఏపీలో త్రిశంకుసభ ఏర్పడితే తాము జోక్యం చేసుకునేందుకు తగిన ప్రాతిపదిక సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. పవన్ తో సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. టీఆర్ఎస్, వైసీపీ కలిసి తనపై వత్తిడి చేస్తున్నాయంటూ పవన్ ఆరోపణ చేసినప్పటికీ టీఆర్ఎస్ నుంచి పెద్దగా ప్రతిస్పందన కనిపించలేదు. గవర్నర్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో కేసీఆర్ తో జనసేనాని ప్రత్యేకంగా మాట్లాడారు. తనతో మాట్టాడినవారిని ఎవరినైనా సానుకూలంగా మార్చుకోగల నేర్పు కేసీఆర్ కు ఉంది. జనసేనకు ఉన్న అవకాశాలు, వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్ సలహాలిచ్చినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ ప్రస్తుతం బహిరంగంగా వైసీపీతో కలిసి వెళ్లే పరిస్థితి లేదు. కానీ భవిష్యత్తులో హంగ్ అసెంబ్లీ ఏర్పాటైతే కేసీఆర్ వంటివారి మధ్యవర్తిత్వంతో ఒక ఒప్పందం కుదిరే చాన్సులున్నాయనేది పరిశీలకుల అంచనా. ఇదే ప్రస్తుతం జనసేన స్వతంత్ర వైఖరిని ప్రశ్నార్థకం చేస్తోంది. సందేహాలు రేకెత్తిస్తోందితెలుగుదేశం పార్టీ ప్రేమతో జనసేనను నిర్వీర్యం చేసేయాలనుకుంటోంది. పవన్ కాదంటున్నా కౌగిలించుకుంటామంటూ సంకేతాలు పంపుతోంది. కలిస్తే తప్పేమిటి? అంటూ అధినేత చంద్రబాబు నాయుడే పేర్కొన్నారు. ఇది జనసేనకు చాలా ఇబ్బందికర పరిణామం. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటున్న పార్టీ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పవన్ ను విమర్శించవద్దని ఇప్పటికే అందరికీ ఆదేశాలిచ్చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తాజాగా తన సర్వేల ద్వారా తెలుసుకున్నారు చంద్రబాబు. వ్యతిరేకంగా వెళ్లడం వల్ల భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పవన్, టీడీపీ కలిసే వెళతారు. భవిష్యత్తులో పొత్తు ఉంటుందన్న సంకేతాలిస్తే తెలుగుదేశానికి కొంతమేరకు ఉభయగోదావరి జిల్లాల్లో చాన్సులు పెరుగుతాయి. బలమైన క్యాండిడేట్లు ఉన్నచోట్ల టీడీపీ లబ్ధి పొందుతుంది. ఆమేరకు జనసేన నష్టపోతుంది. ప్రత్యర్థిగా మారిన జనసేన అవకాశాలను దెబ్బతీసే ఎత్తుగడ ఇది. వ్యక్తిగతంగా టీడీపీ నాయకులపై ధ్వజమెత్తుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తలేకపోతున్నారు పవన్. ఇది అనేక రకాల అనుమానాలకు దారితీస్తోంది. వ్యూహాత్మకంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేలా పవన్, చంద్రబాబులు అవగాహనతోనే విడివిడిగా పోటీ చేస్తున్నారనే వైసీపీ ప్రచారానికి ఊతం లభిస్తోంది. ఇది కూడా జనసేన ప్రస్థానానికి ఇబ్బందికరం.కాంగ్రెసు హయాంలో నియమితులై బీజేపీ పాలనలోనూ లక్షణంగా కొనసాగింపులు పొందుతున్న వ్యక్తి గవర్నర్ నరసింహన్. నిజానికి కాంగ్రెసు హయాం కంటే ఇప్పుడే కేంద్రం వద్ద ఆయన పరపతి బాగా పెరిగిందనేది రాజకీయ సమాచారం. బీజేపీ ప్రభుత్వంలో అజిత్ దోవల్ వంటి కేంద్ర ప్రభుత్వ సలహాదారుల వద్ద ఆయనకున్న పలుకుబడే ఇందుకు కారణం. పవన్ కల్యాణ్ కు గవర్నర్ ఇచ్చే సాదరసత్కారాలు మొదటనుంచీ అనుమానానికి హేతువులుగానే నిలుస్తున్నాయి. బీజేపీ తరఫున ఆయన రాయబారం నడుపుతున్నారని తెలుగుదేశం, కాంగ్రెసు వంటి పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే ఈవిషయాన్ని గవర్నర్ పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. హోదా రీత్యా వివరణ ఇవ్వడం కూడా ఆయనకు చిన్నతనంగానే ఉంటుంది. అందువల్ల మౌనమే సమాధానంగా నిలుస్తోంది. దీంతో ప్రజల్లో సందేహాలకు తెరపడటం లేదు. జనసేన వంటి పార్టీలు నష్టపోకనూ తప్పడం లేదు