యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దళపతి దేవెగౌడ నిన్న మొన్నటి వరకూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరని అందరూ భావించారు. కానీ ఆయన తాను మాత్రం ఈసారి పోటీలో ఉండేందుకే సుముఖత చూపుతున్నారు. ఎటుపోయి ఎటువస్తుందో…ప్రధాని పీఠం దక్కే అవకాశం దక్కతుందన్న ఆశ దేవెగౌడలో ఉన్నట్లుంది. అందుకే ఆయన తాను 90వ వడిలో పడినా పోటీకి సై అంటున్నారు. తన రాజకీయ జీవితం ఇంకా ముగిసిపోలేదన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చారు.కర్ణాటక రాజకీయాల్లో దేవెగౌడది ప్రత్యేక ప్రస్థానం. జనతాదళ్ ఎస్ ను స్థాపించి కర్ణాటక రాజకీయాల్లో తాను కీలకమని అనేక సందర్భాల్లో నిరూపించారు. అనుకోకుండా ప్రధానమంత్రిగా కూడా కాగలిగారు. అయితే ఈసారి కూడా తనకు అవకాశం దక్కుతుందేమోనన్న ఆశ దేవెగౌడలో ఉన్నట్లుంది. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకటవుతుండటం తనకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. తనను బలపర్చే దక్షిణాదికి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విపక్ష కూటమిలో కీలక భూమిక పోషిస్తుండటం కూడా ఆయనను పునరాలోచనలో పడేసిందంటున్నారు.మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమిని కూడగడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సయితం తనకు సన్నిహితుడే కావడంతో ఆయన ఈసారి కూడా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. తొలుత దేవెగౌడ తాను కొన్ని ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న హాసన్ నియోజకవర్గం నుంచి తన మనవడు ప్రజ్వల్ ను పోట ీచేయాలని నిర్ణయించారు. గత కొద్దినెలల కిందటే దేవెగౌడ తన ఆలోచనను పార్టీ శ్రేణుల ఎదుట బయటపెట్టారు. దీంతో దేవెగౌడ ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరని అందరూ భావించారు.తన మనస్సులో ఏముందో దేవెగౌడ చెప్పకనే చెప్పారు. తన మనవడు ప్రజ్వల్ హాసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని దేవెగౌడ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు కలిసే లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంటాయని కూడా చెప్పారు. అయితే మరో విషయాన్ని కూడా చెప్పి ఆయన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను కూడా లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నానని, త్వరలోనే దీనిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. బెంగళూరు ఉత్తర పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని దేవెగౌడ భావిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేస్తే తన గెలుపు సునాయాసమని నమ్ముతున్నారు. అందుకే ఆయన ఉత్తర నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్రమంత్రిగా ఉన్న సదానంద గౌడ ఉన్నారు.