యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వంగవీటి రాధా భవితవ్యం సందిగ్దంలో పడింది. ఆయన ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. రంగా హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి రాధా క్లీన్చిట్ ఇవ్వడంపై కాపుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం పార్టీలో చేరికను కాపులు వ్యతిరేకిస్తున్నారు. రాధా టీడీపీలో చేరితే తాము కాపు కాయలేమని నిర్మొహమాటంగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు చెబుతున్నారు. దీనికి తోడు రాధా రాకను కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గం నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుననట్లు తెలుస్తోంది. ఉన్న పళంగా పార్టీలో చేరి తమ అవకాశాలకు గండికొడుతున్నారని దేవినేని వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక రాధ ముందు రెండే ఆప్షన్లు. టీడీపీలో కళ్లు మూసుకుని చేరడం,లేకుంటేకాపుల ఆగ్రహానికి లోను కాకుండా జనసేన పార్టీలో చేరడం. వంగవీటి మోహన రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధా 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇరవై ఆరేళ్ల వయసులో రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గా గెలిచిన రాధ.., 2009 నాటికి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. వంగవీటి కుటుంబానికి రాజకీయ వారసుడిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన రాధా దూకుడుగా వ్యవహరించేవారు. 2004-09 మధ్య దేవినేని నెహ్రూకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని రాధ సహించలేకపోయారు. అంతకు ముందు కూడా విజయవాడలో అధికారులు అంతా నెహ్రూ చెప్పు చేతల్లో ఉండటంపై బాహాటాంగా అసంతృప్తి వ్యక్తం చేసే వారు. విజయవాడ డీటీసీ సంక ప్రసాదరావుకు వ్యతిరేకంగా ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం…సీఎం వైఎస్ ఆగ్రహానికి కారణం అయ్యింది.2008 డిసెంబర్ లో రంగా వర్థంతి సందర్భంగా ఉడా చైర్మన్ మల్లాది విష్ణు పై రాధా అనుచరులు దాడి చేశారు. అప్పటికే ప్రజా రాజ్యంలోకి వెళ్లేందుకు సిద్ధమైన రాధ …, వంగవీటి రంగా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులు అర్పించడాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు. అంతకు ముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నెహ్రూ కు సంబంధించిన స్థలాన్ని వైఎస్ క్రమబద్దీరించడంతో రాధ నిప్పులు చెరిగారు. తన తండ్రిని చంపిన వారికి పార్టీ మద్దతు ఇచ్చి., ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. వైఎస్ స్వయంగా రాధ ను బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. 2009కు ముందు ప్రజా రాజ్యంలో చేరి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ప్రజా రాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంతో., మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ల లేకపోయారు. వైఎస్సార్సీపీ లో చేరారు. వైసీపీ లో రాధా కు తగిన ప్రాధాన్యత ఇచ్చినా ఆయన నిలుపోకోలేక పోయారని వాదన ఉంది. విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన నియోజక వర్గంపై దృష్టి పెట్టకుండా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ యువజన వ్యవహారాల అధ్యక్షుడిగా ప్రకటించినా దాని పట్టించుకోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతాయి. బందరు పార్లిమెంట్., అవనిగడ్డ స్థానాలో కాపు ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో వాటి నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. ఎన్నికల్లో పూర్తి ఖర్చు భరిస్తామని జగన్ భరోసా ఇచ్చినా రాధా యక్టివ్ రోల్ తీసుకోడానికి వెనుకాడారు. తనకు ఏమి కావాలో స్పష్టంగా చెప్పకపోవడం., రంగా ఇమేజ్ మీదే ఇప్పటికీ రాజకీయాలు చేస్తుండటం ప్రధాన లోపం. వాస్తవానికి రాధానిన్ననే టీడీపీలో చేరాల్సి ఉంది. కాపు నేతల్లో ఆగ్రహంకారణంగానే చేరలేదని తెలుస్తోంది. మరి రాధా ఎలాంటినిర్ణయంతీసుకుంటారో చూడాలి.