Highlights
- మార్చి 10 న కొత్త పార్టీ ఆవిష్కరణ
- మిలియన్ మార్చ్ జరిగిన మార్చే ముహుర్తం..
- హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సమావేశం
తెలంగాణ జేఏసీ చైర్మెన్ కోదండరామ్ నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు పార్టీ ఆవిర్బావాన్ని చేపడతారనే విషయం ఉత్కంఠను రేపుతోంది. మార్చి 10 వ తేదీన పార్టీ ఆవిష్కరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే రోజున కొత్త పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలను చర్చించారు. ప్రత్యేకంగా కోదండరామ్ స్థాపించదలచిన పార్టీపైనే చర్చించినట్లు సమాచారం.
మలిదశ ఉద్యమ దిశను మార్చిన చారిత్రక మిలియన్ మార్చ్ జరిగిన మార్చ్ 10న కోదండరామ్ పార్టీ ఆవిష్కరణ చేపడితే బాగుంటుందని సమావేశంలో సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి సుమారు 15 వేల మందిని సమీకరించాలని పలువురు నాయకులు సూచించారు. ఇందుకోసం ప్రణాళికాబద్దంగా జిల్లాకో నాయకుడిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సమావేశం ఏర్పాటుపై కొందరు భిన్నాభిప్రాయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వరంగల్ లో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కోదండరామ్ అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ నెలాఖరున తిరిగి రాగానే తుది నిర్ణయం చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.