యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికలు ఎంతో కీలకమైనవని అందువలన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడి ఎన్నికలకు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా పార్టీని ఎవరు వీడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా కొత్తవారు ఎవరైనా పార్టీలోకి వస్తే వారిని చేర్చుకోవాలని పార్టీశ్రేణులకు సూచించారు. కొంతమంది శాసనసభ్యుల పనితీరు సక్రమంగా లేదని, ప్రజల్లోకి వెళ్లటం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలను సైతం సక్రమంగా కొంతమంది శాసనసభ్యులు పాటించటం లేదన్నారు. రానున్న ఎన్నికల సందర్భంగా అభ్యర్థులకు భిపారం ఇచ్చే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రమాణం చేయించుకున్న తరువాతనే వాటిని అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని చీరాల, కందుకూరు నియోజకవర్గాల్లో బూత్‌కన్వీనర్లను పెంచాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. కేవలం 70శాతం వరకు బూత్‌కన్వీనర్లను నియమించటం జరిగిందని మిగిలిన శాతాన్ని కూడా పెంచాలన్నారు. జన్మభూమిలో వచ్చిన పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని పార్టీనేతలకు ఆదేశాలు జారీచేశారు. డ్వాక్రాసంఘాలను బలోపేతం చేద్దామని, ఇంకా పదివేల రూపాయలు మంజూరు చేద్దామంటూ నేతలకు సూచించారు. రైతులను అన్నివిధాల ఆదుకునేందుకు రైతు బంధుపధకాన్ని ప్రవేశపెట్టి అందర్ని ఆదుకుందామని ఆయన నేతలకు సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణాజలాలను తరలించి ప్రకాశం జిల్లాకు ఇద్దామని ఆయన పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టుపనులను త్వరగా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నానని అదేవిధంగా జిల్లాప్రజాప్రతినిధులు కూడా దృష్టిసారించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో మాట్లాడుతూ జిల్లాలో మంచినీటి సమస్య ఎక్కువుగా ఉందని అందువలన ఆ సమస్యను తీర్చేందుకు నాగార్జున సాగర్‌నీటిని విడుదల చేయాలని కోరారు. జిల్లాలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా సోమశిల రిజర్వాయరు నుండి అర టిఎంసి నీటిని రాళ్లపాడు రిజర్వాయరుకు మళ్లీంచాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.