యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సోషలిస్టు నాయకుడు, సమతా పార్టీ వ్యవస్థాపకుడు, అనేక పోరాటాల యోధుడు, కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేసారు. అయన చట్టసభల్లో కార్మికుల గళాన్ని వినిపించిన నేత. దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరని అయన కొనియాడారు. అలనాడు ఎమర్జెన్సీ చీకటి పాలనను ఎదిరించి పోరాడిన యోధుడని అన్నారు.
అత్యవసర పరిస్థితి కాలంలో జైల్లో ఉండే బీహార్ లోని ముజఫర్పూర్ నియోజకవర్గం నుంచి 5లక్షల మెజారిటీతో గెలిచిన నాయకుడని అయన అన్నారు. తొమ్మిది పర్యాయాలు లోక్ సభకు ఎన్నికైన ఫెర్నాండెజ్ ఉత్తమ పార్లమెంటేరియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, వాజపేయీ ప్రభుత్వంలో రక్షణ, రైల్వే మంత్రిగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. నిరాడంబరతకు, నిత్యజీవితంలో నిజాయతీకి నిదర్శనం జార్జి ఫెర్నాండెజని చంద్రబాబు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుడా జార్జి ఫెర్నాండెజ్ మృతికి సంతాపం తెలిపారు. కార్మిక నేతగా, కేంద్ర మంత్రిగా జార్జి ఫెర్నాండెజ్ ఉత్తమ సేవలు అందించారని సీఎం కొనియాడారు.