ఈ నెల 31వ తేదీన చేపట్టిన చలో కత్తిపూడి వాయిదావేస్తున్నట్లు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖను విడుదల చేశారు. కాపు రిజర్వేషన్ పై చంద్రబాబు అసెంబ్లీలో చట్టబద్ధతను రిజర్వేషన్ అమలు చేస్తానని హామీ ఇచ్చారు, కాబట్టి చంద్రబాబు నడకను బట్టి కాపు జేఏసీ నేతలతో మరొకసారి కూర్చొని చర్చలు కొనసాగిస్తామని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు తీరుపై ముద్రగడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎన్నికల్లో గెలుపు కోసం అనేక కులాలతో నాలుగు రోడ్ల జంక్షన్ లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని కానీ మీరు ఇచ్చిన హామీ అమలు చేయమని గత నాలుగేళ్ల నుండి పోరాటం చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా వేల సంఖ్యలో కిర్లంపూడి లో పోలీసులను పెట్టి మా జాతి పై కక్ష సాధింపు చర్య చేపడుతున్నారని ముద్రగడ లేఖలో ఆరోపించారు. అన్ని కులాల తోను సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని కానీ మీ కమ్మటి కులంతో సమావేశాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆంతర్యమేమిటని ఆయన లేఖలో ప్రశ్నించారు. వేల సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఇక్కడ పోలీసులకు కనీసం మంచినీళ్లు తినడానికి తిండి దొరకడం లేదని వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నన్ను మీరే సెంటర్ జైల్ లో పెట్టేస్తే ఈ పోలీసులకు కష్టం వుండదని అన్నారు. కార్యక్రమం వాయిదా పడగానే కిర్లంపూడిలో ఏర్పడిన ఉద్రిక్తత తగ్గింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.