యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
న్యూజిలాండ్ గడ్డ మీద భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కోహ్లి సేన ఐదు వన్డేల సిరీస్‌ను వరుస విజయాలతో 3-0తో కైవసం చేసుకున్నట్టుగానే.. మహిళల జట్టు కూడా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుపొందింది. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో నెగ్గిన మిథాలీ సేన.. రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బే ఓవల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు 44.2 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ అమీ సటెర్త్‌వైట్ (71) మాత్రమే రాణించింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి 3 వికెట్లు పడగొట్టగా.. ఏక్తా బిస్త్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు తలో రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ జెమిమా రోడ్రిగ్యూస్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. దీప్తి శర్మ కూడా 8 రన్స్‌కే పెవిలియన్ చేరింది. కానీ స్టార్ ప్లేయర్ స్మృతి మంధనా (90 నాటౌట్), కెప్టెన్ మిథాలీ రాజ్ (63 నాటౌట్) భారత్‌కు విజయాన్ని అందించారు. తొలి వన్డేలోనూ స్మృతి మంధనా అద్భుత శతకంతో జట్టును గెలిపించింది. 193 పరుగుల లక్ష్య చేధనలో ఓపెనర్లు జెమీమా (81 నాటౌట్), మంధనా (105) మెరవడంతో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.