యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చలో కత్తిపూడి సమావేశానికి అనుమతి తీసుకోలేదనే ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ముద్రగడ పద్మనాభం వాయిదా వేసుకొన్నారు.ఈ విషయమై చంద్రబాబుకు రాసిన లేఖలో పలు అంశాలను ముద్రగడ ప్రస్తావించారు. మూడేళ్లుగా మా జాతి కోసం జరిగిన ఉద్యమం గురించి చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కానీ, ఈ సమావేశం గురించి మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్ధం కావడం లేదని ముద్రగడ అన్నారు.అన్ని పార్టీల నేతలు అనేక సభలను ఏర్పాటు చేసుకొంటారు,, మీరు కూడ ధర్మపోరాట దీక్షల పేరుతో సభలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీరు ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మీరు బస్సు యాత్ర పేరుతో ఏ జిల్లాకైనా బయలుదేరినప్పుడు ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.మీ అందరికీ ఒక రాజ్యాంగం.. మాకు మరొక రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారూ అని ముద్రగడ ప్రశ్నించారు.చలో కత్తిపూడి సభకు అనుమతి తీసుకోలేదని ఎస్పీ ప్రకటించిన నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసుకొన్నారు ముద్రగడ పద్మనాభం.