యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నేడు ప్రజల జీవనం సైన్స్ అండ్ టెక్నాలజీతోనే ముడిపడి ఉందని మంత్రి నారాయణ అన్నారు.
స్థానిక సంతపేట లోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాల లో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనాలపై విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో విద్యార్థి దశ నుంచే పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో జరుగుతున్న ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో 589 మంది పాల్గొనటం ద్వారా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో సైన్స్ పై అవగాహన పెరగడం సంతోషించాల్సిన అంశమని ఈ సంఖ్య ఇంకా పెరగాలనన్నారు. ఇటీవల ప్రయోగించిన శాటిలైట్ ను ఇంజనీరింగ్ విద్యార్థులే తయారుచేయడం ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇస్రో ద్వారా దేశంలో ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపించిన ఘనత భారతదేశానిదన్నారు. దేశంలో పది లక్షలమందిలో 160 మంది మాత్రమే సైంటిస్టులు ఉన్నారని ఈ సంఖ్య ఇంకా పెరగాలన్నారు. ఇతర దేశాల్లో ఈ సంఖ్య వేలల్లో ఉందన్నారు. పరిశోధనలో ప్రతి పదిలక్షల మందికి 0.03 శాతం మాత్రమే ఉండడం సరికాదన్నారు. టెక్నాలజీ వినియోగంలో ఏపీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని మంత్రి అన్నారు. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందున్నారన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ను రాష్ట్రపతితో పాటు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని అన్నారు. స్టార్ట్ అప్ లకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు మోడళ్లను, ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మేయర్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే, జిల్లా విద్యాశాఖాధికారి తదితరులు పాల్గొన్నారు.