YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధర్మాన బ్రదర్స్ ఒక్కటయ్యారు

 ధర్మాన బ్రదర్స్ ఒక్కటయ్యారు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

శ్రీకాకుళం జిల్లాల్లో వచ్చేఎన్నికలు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు మామూలుగా ఉండదు. రెండు పార్టీలు హోరాహోరీ తలపడనున్నాయి. ఇప్పుడు దృష్టంతా ఆ బ్రదర్స్ మీదనే. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అన్న చర్చ జరుగుతోంది. నరసన్న పేట నియోజకవర్గం ధర్మాన కుటుంబానికి కంచుకోట. సామాజిక పరంగా చూసుకున్నా వీరికి అండగా ఉండే నియోజకవర్గమని చెప్పకతప్పదు. నరసన్న పేట నియోజకవర్గంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రెండు సార్లు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ మూడు సార్లు విజయం సాధించారు. దీన్ని బట్టే ఈ కుటుంబానికి నియోజకవర్గంలో ఎంత పట్టుందో చెప్పకనే తెలుస్తోంది.2004,2009 సాధారణ ఎన్నికల్లోనూ, 2012 ఉప ఎన్నికల్లోనూ గెలిచిన ధర్మాన కృష్ణ దాస్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడమేనని, విభేదాలు కారణంగా దూరం కావడంతో కృష్ణ దాస్ ఓటమి పాలయ్యారన్న విశ్లేషణలూ లేకపోలేదు. ఈనియోజకవర్గంలో కేవలం సామాజికవర్గం మాత్రమే కాకుండా ధర్మానకు దగ్గర బంధుగణం కూడా ఎక్కువే. అయినా గత ఎన్నికల్లో 5800 ఓట్ల తేడాతో కృష్ణ దాస్ ఓటమి పాలయ్యారు. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై అంత వ్యతిరేకత కూడా లేకపోవడం విశేషం.బగ్గు రమణమూర్తికి కూడా సామాజిక పరంగా, బంధుగణం పరంగా బలమెక్కువేనని చెప్పాలి. నియోజకవర్గంలోని పోలాకి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండలాల్లో పెద్దయెత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈసారి బగ్గు రమణమూర్తికి టిక్కెట్ వచ్చేది డౌటేనంటున్నారు. ఇక్కడ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుల నుంచి ఒకరు పోటీచేస్తారన్న ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. వాస్తవానికి బగ్గు రమణమూర్తి మంత్రి అచ్చెన్నాయుడు వర్గమే. ఇప్పటి వరకయితే బగ్గుపై అసమ్మతి లేకపోయినప్పటికీ కింజారపు కుటుంబం నుంచే ఆయనకు ముప్పు పొంచి ఉందన్నది వాస్తవం. అయితే తనకు తిరిగి చంద్రబాబు టిక్కెట్ ఇస్తారన్న నమ్మకంతో రమణమూర్తి ఉన్నారు. ధర్మాన సోదరులు ఇప్పుడు గెలుపుపైనే దృష్టి పెట్టారు. కలసికట్టుగా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో కంచుకోట ను కోల్పోయినందుకు వారిలో పశ్చాత్తాపం కన్పిస్తుంది. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచేందుకు గ్రామ గ్రామాన పర్యటిస్తున్నారు. వైసీపీకి ఇక్కడ బలమైన క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు ఉండటమూ కలసి వచ్చే అంశమని చెబుతున్నారు. ఈసారి తాను గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో కృష్ణదాస్ ఉన్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కూడా ఇక్కడ సూపర్ సక్సెస్ కావడం, బ్రదర్స్ ఏకమవ్వడంతో వైసీపీకి సునాయాస విజయమన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.అయితే ఇప్పటి వరకూ జనసేనకు ఇక్కడ ఎవరు నాయకుడో తేల్చలేదు.

Related Posts