యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇటీవల కాలంలో ఉపాసన తరచూ వార్తల్లో వస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ఆమె ప్రమేయం లేకుండానే ఆమె వార్తల్లోకి రావాల్సి వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల కు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రాక్టికల్ గా సాధ్యం కానప్పటికీ.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ ప్రచారం జోరందుకుంది.దీనికి తోడు ఒక ఇంగ్లిషు దినపత్రికలో ఈ కథనం అచ్చు కావటంతో ఈ చర్చ మరింత పెరిగింది. ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా వ్యవహరిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఉపాసనకు బాబాయ్ కావటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరటం తెలిసిందే.
తాజాగా జరుగుతున్న ప్రచారంపై ఉపాసన స్పందించారు. తాను ఎంపీ ఎన్నికల బరిలో దిగనున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. తనను క్షమించాలని.. తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న ఉపాసన.. “ప్రస్తుతం నేను నా జాబ్ ను ప్రేమిస్తున్నా. ప్రస్తుతం నా బాస్ సంగీతారెడ్డి. చేవెళ్లకు చిన్నాన్న చేస్తున్న సేవ సాటిలేనిది” అంటూ పెట్టిన పోస్టుతో ఉపాసనపై జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లేనని చెప్పొచ్చు.