YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు

 జగన్ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మరో మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికు చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన హామీలు కూడా ఇచ్చారు. ఇటీవలి కాలంలో వెల్లడైన పలు జాతీయ సంస్థల సర్వేలను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించడం ఖాయమని తేలుతోంది. అయితే, గత ఎన్నికల వేళ కూడా ఎక్కువ సర్వేలు జగన్ అధికారంలోకి రానున్నారని చెప్పాయి. కానీ, ఫలితాలు తారుమారయ్యాయి. జగన్ చేసిన కొన్ని పొరపాట్లు, పోల్ మేనేజ్ మెంట్ అనుభవం లేకపోవడం వంటి కారణాలతో ఆయన ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా జగన్ ఓటమికి అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగకపోవడం కూడా ప్రధాన కారణమని అందరూ ఒప్పుకోవాల్సిందే. అందుకే, ఈసారి ఎటువంటి తప్పిదమూ జరగకుండా చూసుకుంటున్న జగన్ అభ్యర్థులపై ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ విజయంపై ధీమాగా ఉన్న జగన్.. అభ్యర్థుల ఎంపికపై పెద్దగా కసరత్తు చేయలేదు. స్థానికంగా బలం లేని వారికి కూడా కొందరికి టిక్కెట్లు ఇచ్చారు. ఇక, వారు ఎంతవరకు పార్టీకి విశ్వాసంగా ఉంటారనేది కూడా చూసుకోలేదు. జగన్ బంధువులు, సన్నిహితులు టిక్కెట్ల కేటాయింపులో కీలక పాత్ర పోషించారు. కొన్ని నియోజకవర్గాల్లో జగన్ మొహమాటానికి వెళ్లి ఆయన బంధువులు, సన్నిహితులు చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారు. మరికొందరికి బలమైన అభ్యర్థులు కాదని తెలిసినా కాదనలేక టిక్కెట్లు ఇచ్చారు. అయితే, జగన్ ఇలా వ్యవహరించడం ఆయన ఓటమికి ప్రధాన కారణమైంది. ఇలా మొహమాటంతో టిక్కెట్లు ఇచ్చిన వారు చాలా వరకు ఓటమి పాలయ్యారు. కొందరు గెలిచినా కొన్ని రోజుల్లోనే పార్టీ ఫిరాయించి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇది జగన్ కి చాలా అనుభవమే నేర్పించింది. అందుకే ఈసారి ఎటువంటి మొహమాటాలకు వెళ్లేది లేదని గట్టిగా నిర్ణయించుకున్నారట.ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పాదయాత్ర చేస్తున్న సమయం నుంచే జగన్ కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతున్నప్పుడే అభ్యర్థుల బలాబలాలను జగన్ అంచనా వేసుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఒక అంచనాకు వచ్చారు. బలంగా లేని నియోజకవర్గాల్లో బలమైన నాయకులను కూడా ఎంపిక చేసుకుని పార్టీలో చేర్చుకుని వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఈ సమయంలో పార్టీని నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. సదరు నాయకులను బుజ్జగించి పార్టీలోనే ఉండేలా ప్రయత్నం చేశారు. దీంతో సమన్వయకర్తలను మార్చిన చోట్ల కూడా పెద్దగా పార్టీకి పెద్దగా ఇబ్బంది జరగలేదు. ముఖ్యంగా సర్వేలపై జగన్ ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పలు దఫాలు సర్వే నిర్వహించింది. ఏయే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో కూడా పూర్తిగా నివేదికలను జగన్ తెప్పించుకున్నారు. ఈ సర్వేల ఆధారంగానే జగన్ టిక్కెట్లు కేటాయించనున్నారు. ఇక, గతసారిలా ఈసారి బంధువులు, సన్నిహితుల సిఫార్సులు ఈసారి జగన్ వద్ద ఏమాత్రం పనిచేయవట. నియోజకవర్గంలో బలం, పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తీరును బట్టే టిక్కెట్ల కేటాయింపు జరగనుంది. ఇక, అభ్యర్థుల ఆర్థిక, సామాజక బలాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.

Related Posts