YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బీజేపీకి మరో షాక్..

 ఏపీ బీజేపీకి మరో షాక్..

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీ బీజేపీలో మరో రెండు వికెట్లు పడనున్నాయా..? గత ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఆ పార్టీకి ఒక్కరే మిగలనున్నారా..? రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతున్న బీజేపీకి భారీ పరాభవం తప్పదా..? అంటే.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పింది. కేంద్రంలో తన మంత్రుల చేత కూడా రాజీనామా చేయించింది. దీంతో దానికి ప్రతిగా ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ సంబంధాలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. ప్రధాని మోదీ ఏపీకి ఎంతో చేస్తున్నా.. టీడీపీ అభాండాలు వేస్తోందని బీజేపీ నేతలు అదే పనిగా చెబుతూ వస్తున్నారు. మోదీ పథకాలనే.. టీడీపీ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. పొత్తుకు ముందు టీడీపీ ప్రభుత్వంపై ఏమాత్రం విమర్శలు చేయని నేతలు.. కటీఫ్ చెప్పిన తర్వాత అవినీతి ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీ మారారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకే సిద్ధమైన బీజేపీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారోనన్న ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.2014లో టీడీపీ మద్దతుతో బీజేపీ టికెట్ పై పోటీ చేసి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. తాడేపల్లి గూడెం నుంచి మాణిక్యాల రావు,  విశాఖపట్టణం (ఉత్తరం) నియోజకవర్గం నుంచి పీ. విష్ణుకుమార్ రాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, రామచంద్రాపురం అర్బన్ నుంచి ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీడీపీతో పొత్తు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో సీన్ రివర్స్ అయింది. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ తనదారి తాను చూసుకున్నారు. జనసేనలో చేరి రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కామినేని శ్రీనివాస్ ఎన్నికల నాటికి టీడీపీలో చేరతారని ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీతో కటీఫ్ చెప్పిన తర్వాత టీడీపీపై కామినేని పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే టికెట్ విషయమై టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్లు టాక్. ఇక విష్ణుకుమార్ రాజు కూడా ఎన్నికల నాటికి టీడీపీలోకి కానీ, వైసీపీలోకి కానీ చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల భోగట్టా. టీడీపీ ప్రభుత్వంపై అప్పుడప్పుడు విమర్శలు చేస్తుంటారాయన. మరోవైపు చంద్రబాబు పనితీరుపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు కూడా. వైసీపీ అధినేత జగన్ పై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే అన్నట్లుగా కూడా చాలాసార్లు మాట్లాడారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ రెండింటిలో ఏదో ఒకదాంట్లో విష్ణుకుమార్ చేరతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు కానీ, సిట్టింగ్ స్థానం కానీ.. ఏదో ఒక దానిపై హామీ ఇచ్చిన పార్టీలోకి చేరతారని గుసగుసలాడుకుంటున్నాయి. ఇక మిగిలిన మాణిక్యాలరావు మాత్రం.. బీజేపీ తరపున గట్టిగా పోరాడుతున్నారు. చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. బీజేపీ చేసిన వాటికి, ఏపీ ప్రభుత్వం చెబుతున్న వాటికి పొంతన లేవన్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి మాణిక్యాల రావు మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేల్లో మిగులుతారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరగబోతోందో.. కొద్ది నెలలు ఆగితేనే తేలుతుంది..

Related Posts