YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనుకున్నదొక్కటి... అయినొదక్కటి.. కాంగ్రెస్ నేతల డీలా...

 అనుకున్నదొక్కటి... అయినొదక్కటి.. కాంగ్రెస్ నేతల డీలా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా టీడీపీతో పొత్తు ఖరారు అవుతుందన్న ఊహాలోకంలో విహరించిన కాంగ్రెస్ నాయకులు ఇపుడు తీరిగ్గా చింతిస్తున్నారు. టీడీపీతో పొత్తు లేదు అంటూ చావు కబురు చల్లగా కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమన్ చాంది చెప్పేసరికి ఉక్కిరిబిక్కిరి కావడం హస్తం పార్టీ నేతల వంతు అయింది. నిజానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడిపోయింది. మిగిలిన అరకొర నాయకులు రేపటి ఎన్నికల్లో వేరే పార్టీలోకి పోవాలనుకుంటున్న తరుణంలో పొత్తు పేరుతో పేరాశ కల్పించారు. తీరా అది ఇప్పుడు చిత్తు కావడంతో ఆ పార్టీ నేతల్లో కంగారు చాలా ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్ టీడీపీ పొత్తు అన్న మాట వినగానే విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన పసుపులేటి బాలరాజు ఏకంగా జనసేన పార్టీలోకి జంప్ అయిపోయారు. అయితే చాల మంది నాయకులు వస్తారులే అన్న ధీమాతో అప్పట్లో కాంగ్రెస్ ఉండేది. ఇక కాంగ్రెస్ విశాఖ దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది. ఆ వేడుకలకు పార్టీలో టికెట్ కోసం ఆశపడిన వారంతా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసుకుని మరీ వచ్చారు. టీడీపీ పొత్తుతో కనీసం జిల్లాకు మూడు వంతున అసెంబ్లీ టికెట్లు అడుగుదామని కూడా ఖద్దరు నేతలు ఆశపడ్డారు. అరకు పార్లమెంట్ సీటు నుంచి 2009 ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయిన విజయనగరం జిల్ల్లాకు చెందిన కిశోర్ చంద్రదేవ్ లాంటి నాయకులు కూడా మళ్ళీ రంగంలోకి వచ్చారు. మళ్ళీ అరకు ఎంపీ సీటు నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి కావాలని కూడా ఆశలు పెంచుకున్నారు. ఇక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అయితే వైసీపీ నుంచి పిలుపు ఉన్నా కూడా కాంగ్రెస్ దే మళ్ళీ అధికారం అన్న ఆలోచనతో పార్టీలోనే ఉండిపోయారు. విశాఖ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ప్రభుత్వ విప్ అయిన ద్రోణం రాజు శ్రీనివాస్ అయితే మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయినట్లేననుకున్నారు.కాంగ్రెస్ టికెట్ల పై అపుడే కర్చీఫ్ వేసేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గర బంధువు పరుచూరి భాస్కరరావు ఆర్భాటంగా పార్టీ కండువా కప్పేసుకున్నారు. అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పొత్తులో భాగంగా తీసేసుకుని ఎమ్మెల్యే అయిపోవాలని కూడా కలలు కన్నారు. అయితే ఆయన ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో ఉండలేక ఇప్పటికిపుడు వేరే పార్టీలోకి వెళ్ళలేక ఆయన సతమతమవుతున్నారు. ఇక మిగిలిన పార్టీలలో నుంచి కూడా కాంగ్రెస్ లోకి రావాలనుకున్న వారు మాత్రం ఇపుడు తాజా పరిణామాలు చూసి మంచి పనే చేశామనుకుంటున్నారు. మొత్తం సీట్లకు పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లకు కనీసం ఓ మాదిరి పలుకుబడి ఉన్న అభ్యర్ధులు కాంగ్రెస్ పార్టీకి దొరకడం అంటే ఇపుడు కష్టమైన వ్యవహారమేనని అంటున్నారు. పొత్తు పేరుతో కాంగ్రెస్ ని మరో మారు టీడీపీ చిత్తు చేసిందని కూడా వాపోతున్నారు 

Related Posts