యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు.
‘లోక్‌పాల్ బిల్లు 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. కానీ ఇంతవరకూ లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించలేదు. అసలు ఏ పార్టీ దీని గురించి పట్టించుకోవట్లేదు’ అని హజారే అసహనం వ్యక్తం చేశారు. లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటుచేసే వరకూ నిరాహార దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హజారే నిరాహార దీక్ష గురించి ప్రకటించారు. ‘2014లో అవినీతి రహిత ప్రభుత్వం అనే నినాదంతో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన లోక్‌పాల్ బిల్లును అమలు చేస్తారని, తద్వారా దేశంలో అవినీతికి కళ్లెం పడుతుందని ఆశించా. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రభుత్వం కావాలనే దీన్ని ఆలస్యం చేస్తూ వస్తోంది. అందుకే నేను మరోసారి దీక్షకు దిగుతున్నా’ అని ఆ సందర్భంలో హజారే తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త నియామకాలపై హజారే గతంలోనూ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.