యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇప్పటికే ఆర్‌బీఐకి కళ్లెం వేసిన కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆంగ్ల పత్రికలు కథనాన్ని ప్రచురించాయి. సెబీ ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఆ ప్రతిపాదనలను ఒక స్వతంత్ర కమిటీకి నివేదించాలని సూచించినట్లు సమాచారం. ఈ కమిటీలో సభ్యులుగా బోర్డు డైరెక్టర్లు ఉంటారా.. బయట వ్యక్తులు ఉంటారా అనే విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. ఒక వేళ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ కమిటీ సభ్యులను నియమిస్తే ప్రభుత్వానికి సెబీపై మరింత పట్టు లభిస్తుంది.సెబీ నిబంధనలను ఆమోదించే ముందు ఆ ప్రతిపాదనలను ఒక కమిటీ ఎదుట ఉంచాలని ఆర్థిక వ్యవహారాల విభాగం సూచించినట్లు సమాచారం. దీనికి భవిష్యత్తులో సెబీ చట్టానికి సవరణ కూడా చేయాల్సి రావచ్చు. దాదాపు 25 ఏళ్ల నుంచి సెబీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ ఈ కొత్త మార్పు వల్ల సెబీ నిర్ణయాలకు జవాబుదారీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. కానీ సెబీ కొన్నేళ్లుగా అమల్లోకి తెచ్చిన నియమ నిబంధనల్లో ఒక్కదానిని కూడా పార్లమెంట్ మార్చలేదు. ఈ వార్తలపై సెబీ ఇంతవరకు స్పందించలేదు.అక్టోబర్ నెలలో ఆర్‌బీఐ స్వతంత్రత పై వివాదం చెలరేగింది. అప్పట్లో ప్రభుత్వం ఆర్‌బీఐపై సెక్షన్ 7ఎను ఉపయోగించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీని ప్రకారం ఆర్‌బీఐ ఏ నిర్ణయం తీసుకొనే ముందైన ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు అనిపించినా.. బోర్డులోని నామినేటేడ్ డైరెక్టర్ల రూపంలో ఆర్‌బీఐ పట్టు సాధించింది.