యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
న్యూజిలాండ్‌తో గత సోమవారం ముగిసిన మూడో వన్డేకి గాయం కారణంగా దూరమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. గురువారం ఉదయం హామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేతో మళ్లీ టీమ్‌లోకి పునరాగమం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడో వన్డేకి ముందు తొడ కండరాలు పట్టేయడంతో అతని స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులోకి తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్‌లోనూ 38 బంతుల్లో 5x4, 1x6 సాయంతో 38 పరుగులు చేసి క్రీజులో ఆఖరి వరకూ నిలిచాడు. దినేశ్ కార్తీక్ మెరుగైన ప్రదర్శన తర్వాత నాలుగో వన్డేకి అతనిపై వేటు వేయాలా..? లేక కొనసాగించాలా..? అనే మీమాంసలో ప్రస్తుతం టీమిండియా ఉంది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 4, 5వ వన్డే నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో కార్తీక్‌ని ఆడించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ.. కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ శుభమన్ గిల్‌కి అవకాశమివ్వాలని గంగూలీ లాంటి మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. రేపు తుది జట్టు ఎలా ఉండబోతుంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.