YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ, గవర్నర్ మధ్య వివాదం

ఏపీ, గవర్నర్ మధ్య వివాదం

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్, ఏపీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం తలెత్తింది. చుక్కల భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ నరసింహన్ తిరస్కరించారు. ఏపీ ప్రభుత్వం పంపిన రెండు ఆర్డినెన్స్‌ల్లో ఏపీ అసైన్డ్‌మెంట్ ల్యాండ్ ఆర్డినెన్స్‌కు మాత్రమే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం రెండు నెలలు పెట్టడంపై అభ్యంతరం తెలిపిన గవర్నర్.. చుక్కల భూములపై ఆర్డినెన్స్‌ను తిప్పి పంపారు. దీంతో గవర్నర్, ఏపీ ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఐదేళ్ల తర్వాత అమ్ముకునేలా ఇప్పటివరకు ఉన్న నిబంధనలను ఏపీ ప్రభుత్వం మార్చింది. వీటిని 20ఏళ్ల తర్వాత మాత్రమే అమ్ముకునేలా చర్యలు తీసుకుంటూ ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అయితే చుక్కల భూములపై జారీచేసిన ఆర్డినెన్స్‌ను మాత్రం గవర్నర్ ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఆర్డినెన్స్‌లోని విషయాలు సహేతుకంగా లేవని, మరిన్ని వివరాలు సమర్పించాలని కోరుతూ ఆర్డినెన్స్‌ను తిప్పి పంపినట్లు రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో నాలా ఆర్డినెన్స్ విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లకు గవర్నర్ ఆమోదం తెలపడం అన్నది సాధారణ విషయమే. చాలా ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్ వీటిని తిరస్కరించరు. అయితే ప్రభుత్వం, గవర్నర్ మధ్య గ్యాప్ ఉండటంతోనే తరుచూ ఇలాంటి సమస్య తలెత్తుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Related Posts