యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొంది. ఫిబ్రవరి ఐదో తేదీన ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, బీజేఎల్పీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫిబ్రవరి 1వ తేదీన విభజన సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలో చర్చలు జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన నల్లబ్యాడ్జీలతో ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో హాజరుకానున్నారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో అసెంబ్లీకి సెలవులను ఇచ్చారు.ఏపీ ప్రభుత్వం పెన్షన్లను రెట్టింపు చేస్తూ ఇటీవలనే నిర్ణయం తీసుకొంది. దీంతో ఆయా గ్రామాల్లో పెంచిన పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో ఈ మూడు రోజుల పాటు అసెంబ్లీకి సెలవులను ప్రకటించారు.ఫిబ్రవరి ఐదో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 6వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన విజన్ డాక్యుమెంట్‌పై అసెంబ్లీలో చర్చించనున్నారు. అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఇదిలా ఉంటే అవసరాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలను పొడిగించుకోవాలని కూడ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు