యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రం విభజన నష్టాల నుంచి కోలుకుని అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. విభజన చట్టంలోని చాలా హామీలను కేంద్రం ఇంకా నెరవేర్చలేదని గవర్నర్ అన్నారు. కేంద్రం నిధులపై రాష్ట్రం సమర్పించిన వినియోగపత్రాలను నీతి ఆయోగ్ ధ్రువీకరించిందని చెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన విరోధమన్నారు. ప్రజలు ఆతృతగా ఎదురు చూసినా కేంద్రం ఆర్థికంగా ఆదుకోలేదని, రాష్ట్రం అనేక విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండాపోయిందన్నారు. విభజన కారణంగా ఆర్థిక, ఇతర వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడినా.. రాష్ట్ర నాయకత్వం వల్ల కష్టాల నుంచి గట్టెక్కామని చెప్పారు. పింఛన్ల కోసం రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని, ఆదరణ పథకం ద్వారా 90 శాతం రాయితీపై పనిముట్లు అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. నాలుగున్నరేళ్లలో విభజనహామీలతో పాటు ప్రత్యేకహోదా అమలుకాలేదని చెప్పారు. అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధిరేటు నమోదు చేశామని చెప్పారు. అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందని.. అనేక రంగాల్లో ఇప్పటికే సంతృప్త స్థాయిని సాధించామని గవర్నర్ వివరించారు.పొరుగు రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఏపీ చేరే వరకూ కేంద్రం చేయూత అవసరమని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం ఊహించని పరిణామమని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. కేంద్రం సహాయ నిరాకరణకు పాల్పడుతూ తోడ్పాటు అందించడం లేదని.. సహకరించకపోయినా ఆదర్శంగా నిలవడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని చెప్పారు. సగటున రాష్ట్ర వృద్ధిరేటు 10.66గా ఉందన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద 2014-15 నుంచి 2018-19 వరకు రూ.24,618.39 కోట్లు పంపిణీ చేశామని గవర్నర్ నరసింహన్ చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం వయాడక్ట్ విధానం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు కృషి చేస్తోందని.. నాలుగున్నరేళ్లలో అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నరసింహన్ చెప్పారు. సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఈ నాలుగున్నరేళ్లలో రూ.64,333 కోట్లు ఖర్చు చేసిందని.. దీంతో 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,585కోట్లు ఖర్చు చేశామన్నారు. 2019 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమించామని.. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో 263 టీఎంసీల నీటిని డెల్టాకు మళ్లించామన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉభయసభల సభ్యులంతా ఆయనకు నివాళులర్పించారు. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు