YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అతిథులకు ఏర్పాట్లేవీ..?

 అతిథులకు ఏర్పాట్లేవీ..?

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పండగ వస్తుందంటే నెల రోజుల ముందుగానే సిద్ధపడుతుంటాం. వచ్చే అతిథులకు ఏర్పాట్లు చేయడంలో విఫలం కాకూడదని.. వారిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేందుకు కసరత్తు చేస్తుంటాం. కానీ మరో పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న పక్షుల పండగకు అటువంటి కసరత్తు ఏదీ ఇంకా మొదలవ్వనే లేదు.
పక్షుల కేంద్రం వద్ద 20 ఎకరాల్లో వేసిన ప్రయివేటు రియల్‌ ఎస్టేట్‌ స్థలాన్ని గత ఏడాది వేదిక, ఇతర ఏర్పాట్లకు వినియోగించారు. దీన్ని మరింత పెంచి, చర్యలు తీసుకోవాల్సి ఉంది. పెలికాన్‌ ఫెస్టివల్‌ను ఫిబ్రవరి 3న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. అంటే మరో పది రోజులే సమయముంది. కానీ ఇంతవరకూ ఆటపాక పక్షుల కేంద్రంలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేపట్టలేదు. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఆటపాక పక్షుల కేంద్రానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఫిబ్రవరి 4న మొదటి సారిగా ‘పెలికాన్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు. ఈ పక్షుల పండగకు ముందస్తు ఏర్పాట్లకు, పక్షుల కేంద్రంలో మెరుగైన వసతులకు, పండగ రోజున వ్యయానికి మొత్తం కలిపి రూ.కోటిన్నరకు పైగా వెచ్చించారు. పర్యాటకులు, ప్రజలు ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సినీనటుడు విక్టరీ వెంకటేష్‌, మంత్రి అఖిలప్రియ, వందేమాతరం శ్రీనివాస్‌ వంటి ప్రముఖులు వచ్చారు. వచ్చే ఏడాది విస్తృత ఏర్పాట్లతో పండగను మరింత వేడుకగా నిర్వహిస్తామని ప్రకటించారు. జనవరి మూడోవారం పూర్తికావొస్తున్నా పక్షుల కేంద్రం వద్ద పండగ ఊసే లేదు. ఈసారి కూడా పర్యాటకులకు అరకొర వసతులే దిక్కవుతాయా అనే అభిప్రాయం స్థానికులనుంచి వ్యక్తమవుతోంది.
పక్షుల కేంద్రంలో పర్యాటకులకు వసతులు కరవవుతున్నాయి. కైకలూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఆటపాకకు వెళ్లి గ్రామం నుంచి అర కిలోమీటరు దూరం ఉన్న ఈ కేంద్రానికి వెళ్లాలంటే కేవలం 12 అడుగుల వెడల్పు రోడ్డు మాత్రమే ఉంది. దీన్ని ఆటపాక గ్రామం నుంచి పక్షుల కేంద్రం వరకు విస్తరించాల్సి ఉంది. గత ఏడాది పక్షుల పండగ సమయంలో ఇరుకు రహదారుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పక్షుల కేంద్రంలో పర్యాటకులు కూర్చునేందుకు సరిపడా బల్లలు లేవు. కేంద్రంలో రహదారి వర్షాల వల్ల కోతకు గురై ఉంది. ఈ  రహదారిని మరింత పటిష్ఠం చేయాలి. పర్యాటకులు బోటింగ్‌ చేసేందుకు మూడు బోట్లు మాత్రమే ఉన్నాయి. ఆదివారం, పండగలు, ఇతర సెలవు దినాల్లోనే ఇవి సరిపోవడం లేదు. బోటింగ్‌ చేయాలంటే గంటల తరబడి వేసిచూడాల్సి వస్తోంది. పర్యావరణ విద్యాకేంద్రం వద్ద విద్యుత్తు సౌకర్యం లేదు. పక్షుల కేంద్రం ప్రవేశం నుంచి పర్యావరణ విద్యాకేంద్రం వరకు సోలార్‌ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాల్సిన అసవరం ఉంది.
పర్యాటకులు ఇక్కడ సేదతీరేందుకు, అల్పాహారం చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది. పర్యావరణ విద్యాకేంద్రంలో కొల్లేరు సరస్సు, పక్షుల సమాచారం తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన నమూనాలు, మోడల్స్‌ మరింత ఎక్కువగా ఉంచాలి. చిన్నారులకు వీడియో ద్వారా ప్రదర్శనలు చూపిస్తే ఆకట్టుకునే అవకాశముంది. పక్షుల పండగకు వచ్చేవారు వాటిని చూసి ఆనందపడుతున్నారు తప్ప వాటి వివరాలు తెలియడం లేదు. ప్రభుత్వం నిపుణులైన గైడ్లను ఏర్పాటు చేసి పర్యాటకులు పక్షుల పేరు, వాటి వివరాలు తెలియచేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేంద్రం వద్ద దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం విడిది ఏర్పాట్లు లేవు. తినుబండారాలు, మంచినీటి వసతిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆటపాకతో పాటు మండవల్లి మండలం మణుగులూరులంక, కైకలూరు మండలం కొల్లేటికోట, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పక్షులు ఉండే ప్రాంతాల్లోనూ పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని స్థానికుల అభిప్రాయం. కొల్లేరు సరస్సు పర్యాటకంగా అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుందని, దీంతోపాటు పర్యాటకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పర్యావరణ, పక్షి ప్రేమికులు కోరుతున్నారు.

Related Posts