యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాలపై చలిగాలులు పంజా విసురుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో ప్రజలు చిగురుటాకులా వణికి పోతున్నారు. మరో రెండు రోజుల పాటు చలిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగైదు రోజులపాటు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని.. వర్షాలు కురవకపోయినా ఉష్ణోగ్రతలు మాత్రం మరింత కనిష్టానికి పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌పై చలిగాలుల ప్రభావం కొనసాగుతుందని వెల్లడించారు. ఉత్తరాది నుంచి ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల తెలంగాణలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 48 గంటల పాటు తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు పడిపోయే అవకాశం ఉందన్నారు.గత వారం రోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. విదర్భ ప్రాంతలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షంతో పాటు చలిగాలులు ప్రజలను వణికించాయి. ఉదయం 9 గంటల తర్వాత కూడా పొగమంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వైరల్ జ్వరాలు పంజా విసురుతున్నాయి. ప్రజలు స్వైన్ ఫ్లూ, డెంగీ సహా పలు రకాల వైర్ జ్వరాల బారిన పడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురు వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైరల్ వ్యాధులు విజృభిస్తున్న నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, శ్వాసకోస వ్యాధిగ్రస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.