యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
‘మహానటి’ బయోపిక్ మూవీతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. టాలీవుడ్ తొలి బయోపిక్ మూవీ ‘మహానటి’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఇదే ఫ్లోలో విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మిశ్రమ స్పందన రాబట్టింది. తాజాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించడంతో విపరీతమైన హైప్ వచ్చింది. దీనికి తోడు టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలాఉంటే ‘యాత్ర’ సినిమా ప్రధానంగా వైఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలకమైన పాదయాత్రనే ఉంటుందని దర్శకుడు మహి వి రాఘవ చెప్పుకొస్తున్నారు. కాగా ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ నటించగా.. వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటించారు. ఇక వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, కేవీపీగా రావు రమేష్‌లతో పాటు సుహాసిని, పోసాని, యాంకర్ అనసూయ కీలకపాత్రలో నటించారు. అయితే కీలకమైన జగన్ పాత్రపై తొలినుండి అనేక వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా దర్శకుడు మహి వి రాఘవ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. వైఎస్ పాదయాత్రలోని కీలకఘట్టాలను ‘యాత్ర’ సినిమాగా రూపొందించాం. ఈ సినిమాలో జగన్ పాత్రను ప్రత్యేకించి ఓ పాత్రను తీసుకోలేదు. ఆయన రియల్ విజువల్స్ చూపించబోతున్నాం. అంటే రియల్ జగన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మొదట్లో జగన్ పాత్ర కోసం స్క్రిప్ట్ రాసిన మాట నిజమే కాని తరువాత తీసేశాం. ‘యాత్ర’ సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీ.. అందులో కనెక్టవిటీ మిస్ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు మహి వి రాఘవ. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వైఎస్ జగన్ హాజరుకానున్నారు.