యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు చేతిదాకా వచ్చిన విజయం చేజారిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నా.. ప్రధాన కారణం మాత్రం రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ చేస్తానని జగన్ హామీ ఇవ్వలేకపోయారు. చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు. దీంతో రైతులు టీడీపీ వైపు మొగ్గు చూపారు. అయితే, మనమూ రుణమాఫీ హామీ ఇద్దామని పార్టీ నేతలు జగన్ పై ఒత్తిడి తెచ్చినా… రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేమని, చేయలేని హామీని ఇవ్వలేనని జగన్ ఇవ్వలేదంటారు. మొత్తానికి జగన్ ఓడిపోయారు… చంద్రబాబు గెలిచారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి హామీలు, హామీల అమలు, చిత్తశుద్ధి అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. అయితే, గతానికి మించి ఈసారి జగన్ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించగలిగినట్లు కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఒకే మాటపై నిలపడటం. ప్రత్యేక హోదా అంశం నుంచి పార్టీ ప్రకటించిన నవరత్నాల వరకు జగన్ ఒకే మాట మీద ఉన్నారనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడుతోంది. దీంతో ఆయన మాటపై ఉంటారనే ఒక నమ్మకాన్ని మాత్రం జగన్ కలిపించుకోగలిగారు.ప్రత్యేక హోదా విషయంలో జగన్ మొదటినుంచీ ఒకే మాట మీద ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని, అది ఏపీ హక్కు అని ఆయన నినాదం ఎత్తుకున్నారు. అన్ని జిల్లాల్లో యువతతో సభలు నిర్వహించి హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు చెప్పి అవగాహన కల్పించారు. దీక్షలు, ధర్నాలు చేశారు. అయితే, ఆ సమంయలో ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని కాదని టీడీపీ వాదించింది. కానీ, జగన్ మాత్రం ఒకే మాట మీదున్నారు. ఇప్పుడు అందరూ పైకి అంగీకరించకున్నా.. జగన్ మాటపైకే వచ్చి ప్రత్యేక హోదా కావాల్సిందే అంటున్నారు. ఇక, కాపుల రిజర్వేషన్ అనే సున్నిత అంశాన్ని సైతం జగన్ దాటవేత ధోరణితో తప్పించుకునే ప్రయత్నం చేయకుండా… తన చేతుల్లో లేని పని అని, కేంద్రం పరిధిలోని అంశంపై తాను హామీ ఇవ్వలేనని స్పష్టంగా చెప్పారు. ఇది ఆ సామాజకవర్గంలో కొంతమందిలో ఆగ్రహం కలిగించినా… మిగతా ప్రజల్లో మాత్రం జగన్.. చేయగిలిగిందే చెబుతున్నారు అనే ఒక ఇమేజ్ మాత్రం ఏర్పడింది.జగన్ ప్రకటించిన ఎన్నికల హామీల్లోనూ ఇదే జరుగుతోంది. పాదయాత్రకు ముందు సంవత్సన్నర క్రితమే జగన్ ఎన్నికల హామీలనే ‘నవరత్నాలు’ పేరుతో ప్రకటించారు. ఈ హామీలపై మొదట తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. ఇవి అమలు కావని ఎద్దేవా చేసింది. అయితే, వాటిల్లోనే ప్రధానమైన పింఛన్ల రెట్టింపు, ఆటోలు, ట్రాక్టర్లకు ట్యాక్సుల రద్దు వంటి హామీలను ఎన్నికలకు ముందే తెలుగుదేశం అమలు చేసేస్తోంది. మొత్తానికి జగన్ మాట మీద ఉంటారనే ఒక నమ్మకం మాత్రం ఎక్కువ మంది ప్రజల్లో ఏర్పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, జగన్ పై ప్రజల్లో నమ్మకం రావడం వైసీపీకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరిపై లేనంతగా జగన్ వ్యక్తిత్వంపై ప్రత్యర్థుల నుంచి దాడి జరిగింది. జగన్ కోపిష్టి.. గర్విష్ఠి.. స్వార్థపరుడు.. మాటపై నిలబడడు.. అంటూ రకరకాల ప్రచారం ఆయనపై పదేళ్లుగా జరిగింది. ఈ ప్రచారాన్ని తప్పు అని నిరూపించుకోవాల్సిన అవసరం జగన్ కే ఉంది. కాబట్టి, ఈ దిశగా జగన్ కొంత సఫలమైనట్లే కనిపిస్తోంది. మరి, జగన్ పై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో ఎన్నికల్లోనే స్పష్టంగా తెలుస్తుంది.