యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయ సన్యాసం తీసుకున్నా లగడపాటి రాజగోపాల్ కు ఇంకా రాజకీయాలపై ఆసక్తి బయటపెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ ఆయన ఎవరు గెలుస్తారో చెప్పను అంటూనే చెప్పేశారు. అయితే, ఎన్నికల వేళ సర్వే పేరుతో ఆయన చెప్పిన అంచనాలు తెలంగాణలో రాజకీయవేడిని రాజేశాయి. అయితే, లగడపాటి అంచనాలు తలకిందులయ్యాయి. ఆయన చెప్పినట్లుగా కాంగ్రెస్ గెలవకపోగా దారుణంగా ఓటమి పాలయ్యింది. ఇక, 7-8 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని కూడా ఆయన చెప్పగా కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. అయితే, ప్రజలను గందరగోళ పరచడానికి మహాకూటమికి మేలు చేసేలా లగడపాటి ఎన్నికల వేళ తప్పుడు సర్వే ఫలితాలు చెప్పారని టీఆర్ఎస్ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. అయితే, తెలంగాణ ప్రజలు మాత్రం లగడపాటి సర్వేతో ప్రభావితం కాకుండా, గోందరగోళానికి గురికాకుండా ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వారికే వేశారు. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెలన్నర వరకు ఆయన మీడియా ముందుకు రాలేదు. తాజాగా, ఆయన ఓ మీడియా సంస్థ అధినేతతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి సుదీర్ఘంగా చర్చించారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబును లగడపాటి కలవడం, చంద్రబాబుకు సన్నిహితుడైన మీడియా సంస్థ అధిపతి దగ్గరుండి మరీ లగడపాటిని బాబు దగ్గరకు తీసుకెళ్లడంతో ఏదో జరుగుతుందనే అనుమానాలు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో వచ్చాయి. అయితే, ఇంతలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఫలితాల గురించి కాకుండా తెలంగాణ ఎన్నికలపైనే ఆయన మాట్లాడారు. తెలంగాణ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాను ఎవరికో పెంపుడు చిలుకను కానని, ఎవరి ఒత్తిడితో సర్వేలు చేయనన్నారు. తన సర్వేల్లో ఎప్పుడూ తేడా రాదన్నారు. అయితే, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేస్తున్నందునే తాను మీడియా ముందుకు వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి, తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజుల వరకు టీఆర్ఎస్ మద్దతుదారులు, మరికొందరు లగడపాటి సర్వే తప్పయిందని, మహాకూటమిని గెలిపించాలని చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇలా సర్వే వివరాలు చెప్పారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. విమర్శించారు. ఇప్పుడు అటువంటి విమర్శలేమీ పెద్దగా రావడం లేదు. అయినా, ఆయన ఇవాళ మీడియ ముందుకు వచ్చారు.తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పోయిన తన క్రెడిబులిటీని కాపాడుకునే ప్రయత్నంలో లగడపాటి ఉన్నట్లుగా ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే స్పష్టమవుతోంది. ఇక, ఆంధ్రప్రదేశ్ తో పాటు పార్లమెంటు ఎన్నికల సర్వే వివరాలు ఎన్నికలు పూర్తయ్యే వరకు చెప్పనని ఆయన స్పష్టం చేశారు. అయతే, ఈ మాట మీద ఉంటారా అనేది అనుమానమే. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలు కూడా చెప్పను.. చెప్పను.. అంటూనే మొత్తం చేప్పేశారు. అయితే, మీడియా ఒత్తిడి, రిపోర్టర్ల చాకచక్యంతో తెలియకుండా చెప్పేశానని ఆయన చెప్పుకొచ్చారు. పారిశ్రామిక వేత్త, రాజకీయనేత, ఎంపీగా పనిచేసిన లగడపాటి వందలసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. అటువంటాయన రిపోర్టర్ల చాకచక్యానికి దొరికిపోయే చెప్పే అవకాశం ఉందా..? అంటే లేదనే చెప్పాలి. ఆయన చెప్పాలనుకుంది చెప్పేశారు. అయితే, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సర్వే ఫలితాలు చెప్పను అంటున్నారు. మరి, ఆయన మాట మీదే ఉంటారో లేదో చూడాలి. ఆయన చెప్పకున్నా.. లీకులు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఏదో ఓ ఛానల్ లో తన సర్వే వివరాలు వేయించి.. తనకు సర్వే చేసే వారే ఛానల్ కు చేశారని, తనకు సంబంధం లేదని అనవచ్చు. ఇటువంటి ప్రయత్నాలు కొత్తవేమీ కాదు. మరి, ఆయన మాట మీద ఉంటారా..? సర్వే వివరాలు బయటకు తెస్తారా చూడాలి.