YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మిత్ర బంధం...విడిపోతుందా...

 మిత్ర బంధం...విడిపోతుందా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కర్ణాటక సంకీర్ణ సర్కార్ లో మొదలయిన ముసలం ఎటువైపుకు దారితీస్తుంది? రెండు పార్టీలు తప్పు తమది కాదని తేల్చేస్తున్నప్పటికీ దూరం బాగా పెరిగిపోయిందంటున్నారు. తన నిర్ణయాలకు అడ్డుకట్ట వేయకుండా కుమారస్వామి ముందస్తు ఎత్తుగడతోనే రాజీనామా అస్త్రాన్ని సంధించారని కాంగ్రెస్ అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ సర్కార్ ప్రారంభమై ఏడు నెలలే గడుస్తుంది. ఏడు నెలల్లో రెండు పార్టీల మధ్య విభేదాలు నిత్యకృత్యమయ్యాయి. చిన్న విషయాలనూ ముఖ్యమంత్రి పెద్దదిగా చేసి అది జాతీయ అంశంగా మార్చడాన్ని పలువురు పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని, కుమారస్వామిలో ఆ ఉలుకెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కాంగ్రెస్ నేతలు నియమావళిని పాటించడం లేదని, మిత్రధర్మ విస్తరిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని, తాను రాజీనామా చేసేందుకు కూడా వెనకాడబోనని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని కొంత సీరియస్ గానే తీసుకున్నారు. మాట జారిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. జనతాదళ్ ఎస్ కుటుంబ పార్టీ అని వ్యాఖ్యానించిన ఎస్.టి.సోమశేఖర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాదన కూడా వినాలని అగ్రనాయకత్వం నిర్ణయించింది.లోక్ సభ ఎన్నికలకు ముందు కుమారస్వామి కొత్త ఎత్తుగడకు పాల్పడుతున్నారన్న అనుమానం కాంగ్రెస్ లో బయలుదేరింది. ఒకవైపు బీజేపీనేత యడ్యూరప్ప బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాసం తీర్మానం పెట్టాలని చూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యేలను ప్రభావితం చేస్తాయని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ లు అభిప్రాయపడ్డారు. కుమారస్వామి పాలనను పక్కన పెట్టి ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. అయినా కుమారస్వామి మాత్రం గతంలో బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కూడా ఇలా ఇబ్బందులు పడలేదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిత్యం పనుల కోసం తనపై వత్తిడి తెస్తున్నారన్నది కుమారస్వామి అభియోగం. ఒక పద్ధతి లేకుండా ప్రతిపాదనలు పంపడం, దానికి ఓకే చేయాలంటూ వత్తిడి తేవడాన్ని కుమారస్వామి తప్పుపడుతున్నారు. దీంతో పాటుగా తాను సహకరించడం లేదని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేయడం కూడా కుమారస్వామి దృష్టికి వచ్చిందంటున్నారు. జనతాదళ్ ఎస్ కూడా కుమారస్వామికి అండగా నిలిచింది. కాంగ్రెస్ శాసనసభ్యులను నియంత్రించకుంటే తమ దారి తాము చూసుకుంటామని ఆ పార్టీనేతలు బహిరంగంగా చెబుతున్నారు. సిద్ధరామయ్య మాత్రం తమ శాసనసభ్యులను తాము కాక జేడీఎస్ నియంత్రిస్తుందా? అని ఎదురుప్రశ్నించారు. మొత్తం మీద సంకీర్ణ సర్కార్ లో బయలుదేరిన ముసలం ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి

Related Posts