YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రన్న పెళ్లి కానుక కోసం వెయిటింగ్

చంద్రన్న పెళ్లి కానుక కోసం వెయిటింగ్
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చంద్రన్న పెళ్ళి కానుక ద్వారా పేద వధూవరులకు ఆర్థిక సాయాన్ని అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెళ్ళి కానుకను అందిస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా కానుక కోసం సుమారు 30 వేల మంది లబ్ధిదారులు ఎదుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఏప్రిల్‌ నుంచి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, డిసేబుల్డ్‌ వర్గాలకు చెందిన పేద వధూవరులకు చంద్రన్న పెళ్ళి కానుకను అందించనున్నట్టు స్వయంగా సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు దుల్హన్‌ కింద మైనారిటీలకు, గిరిపుత్రిక కళ్యాణ పధకం కింద గిరిజనుల వివాహాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల వర్గాలందరికీ కలిపి చంద్రన్న పెళ్ళి కానుక కింద ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. అన్ని వర్గాలకూ వర్తించే విధంగా మార్గదర్శకాలు రూపొందించ లేకపోవడమూ, మరో పక్క ఏప్రిల్‌ 20 నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించడంతో వేలాది మంది పేద వధూవరులు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశాన్ని కోల్పోయారు. అంతకు ముందు వివాహనంతరం కూడా ఆర్థిక సాయానికి దరఖాస్తులు చేసుకునేందుకు ఉన్న గడువును కుదించడం మరో సమస్యగా మారింది. వివాహానంతరం కూడా దరఖాస్తులు చేసుకునేందుకు గతంలో అవకాశం ఉండేది. పెళ్ళి కానుక తెరపైకి రావడం వల్ల 15 రోజుల పెళ్ళికి ముందు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని నిబంధనలు విధించారు. వీటికి తోడు చంద్రన్న పెళ్ళికానుక వెబ్‌పోర్టల్‌ను నిర్ణయించిన సమయానికి అందుబాటులోకి తేలేకపోయారు. ఈ కారణాల వల్ల అనేక మంది పేద వర్గాల వధూవరులు ఆర్థిక సాయానికి నోచుకోలేకపోయారు. అర్హత ఉన్నా ఆ సమయంలో దరఖాస్తులు చేసుకునేందుకు వీరికి అవకాశం కల్పించకపోవడం వల్ల లబ్ధిదారుల్లో పెద్ద ఎత్తున అంసంతృప్తి వ్యక్తమయ్యింది. ఈ అంశం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళింది. వధూవరులు నిరాశకు గురికావద్దని, దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ రెండు మాసాల్లో దరఖాస్తులు చేసుకోని వారికి తర్వాత అవకాశం కల్పించారు. అలా దరఖాస్తులు చేసుకున్న వారు సుమారు 30వేల మంది వరకు ఉన్నారు. దరఖాస్తులు చేసుకుని ఆరునెలలు కావస్తున్నా ఆర్థిక సాయం అందకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు.

Related Posts