యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సాంప్రదాయ పద్దతిలో ఆవుపేడ, పంచితం, గడ్డి, తడిచెత్త వాడి తయారుచేసే వర్మీ కంపోస్ట్ వాడకం ద్వారా రైతులు ఆశించిన ఫలితాలను పొందుతున్నారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలుకుతూ వర్మికంపోస్టు వాడడానికి ఆశక్తి పెంచుకుంటున్నారు. దీంతో కొందరు రైతులు టిఆర్ కండ్రిగ సమీపం వర్మీ కంపోస్టు స్వంతంగా తయారు చేసుకునే కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ తయారయ్యే వర్మీకంపోస్టును ఇప్పటికే మండలంలోని అధిక శాతం రైతులు వాడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్న మేరకు రసాయనిక ఎరువుల్లో సింథటిక్ కోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది భూమిని గట్టి పరుస్తుంది. భూమిలో పేరుకుపోయిన ఈ రసాయనాలు అమ్మోనియం గ్యాసు వెలువరుస్తుంది. ఇది పంటకు నష్టం కలిగిస్తుంది . పంట నష్టంతో పాటు వాతావరణ కాలుష్యం ఏర్పడే ఆస్కారం ఎక్కువగా ఉంది. భూమి నిస్సారమై మిత్రకీటకాలు కూడా నశించిపోతాయి. భూమి సత్తువ కోల్పోతుంది. వర్మీ కంపోస్టు నిస్సారమైన భూమిని సారవంతంగా మారుస్తుంది. రసాయ ఎరువుల ద్వారా భూమిలో ఇంకిపోయిన భాస్వరం, పోటాషియం, నత్రజనిని మళ్లీ పంటకు ఉపయోగపడేలా చేస్తుంది. పంటకు కావలసిన హార్మోన్లు, విటమిన్లు, సూక్ష్మపోషకాలు, మధ్యపోషకాలు, జింక్ పూర్తిస్థాయిలో లభిస్తుంది. పైరుకు రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది. రసాయనిక ఎరువుల ద్వారా పండించిన పంట కంటే వర్మీకంపోస్టు ద్వారా పండించిన పంట ఆరోగ్యకరమై, నాణ్యత కలిగి ఎక్కువ రోజులు నిల్వవుంటుంది. పంట ఎగుమతి చేసుకునే వీలు కలుగుతుంది. ఈ ఎరువులో తేమశాతం ఉంటుంది కనుక నీటి వాడకానికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక ఎకరాకు 500 కేజీల వర్మీ కంపోస్టు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్మి కంపోస్టు 40 కేజీలకు రూ 300 ఖర్చయితే రసాయనిక ఎరువులకు రూ 1000 ఖర్చవుతుంది. కనుక ఎరువులకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది, తయారీ ఇలా. కంపోస్టు తయారీకి అవసరమైన తొట్టెను నిర్మించుకోవాలి. ఈ తొట్టెలో వరిగడ్డిని ఓ లేయర్గా చేయాలి. తదుపరి ఆరబెట్టిన పేడను ఓ మేరకు వేసి దానిపై తడిచెత్తను వేయాలి. అలాగే మూడు రోజులు మగ్గనిచ్చి ఆపై వానపాముల సీడీను అందులో చల్లి పేడవేసి అలకాలి. తదుపరి జీవామ్చతం పోసి ప్రతి రోజు స్పైయర్ ద్వారా నీళ్లు చల్లుతూ రావాలి .20 నుంచి 30 రోజుల్లోపు వానపాములు పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవడం ద్వారా ఓ మిశ్రమంలా మారుతుంది. పైభాగంలో ఉన్న మిశ్రమాన్ని జల్లిం ఆరబెట్టడం ద్వారా వర్మీ కంపోస్టు తయారవుతుంది. వర్మీ కంపోస్టు తయారుచేసే ప్రాంతంలో పాములు, కప్పలు రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పైభాగంలోని మిశ్రమాన్ని తీసేసిన ప్రతిసారి జీవామతం పోస్తూ మగ్గబెడుతూ రావాలి. ఇలా చేస్తూ తొట్టెలోని మిశ్రమం పూర్తిగా వాడేసిన పిదప మళ్లీ తయారీ ప్రారంభించుకోవాలి.