యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు స్పష్టం చేసారు. గురువారంనాడు ఏపీ జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి మైలవరంలో రూ.1.30కోట్లతో ఏర్పాటు చేసిన అదనపు తరగతిగదులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రం 17వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యపై 25వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు కృషి చేస్తున్నామని, లక్ష 71వేల మంది కార్పొరేట్ విద్యార్థులు ప్రభుత్వ పాఠాశాలల్లో చేరారని తెలిపారు. గతంలో ప్రభుత్వ పాఠాశాలలపై కామన్ మ్యాన్ కు నమ్మకం ఉండేదికాదని, అన్ని పాఠశాలలో మౌలిక వసతులను కల్పించటం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం కల్పించామని పేర్కొన్నారు. దేశంలో విద్యరంగంలో 17వ స్థానంలో ఉన్న ఏపీ ఈ నాలుగేళ్ల కృషి ఫలితంగా మూడో స్థానంలోకి తీసుకువచ్చామని చెప్పారు. కృష్ణాజిల్లాలో విద్యపై 190కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి ఘంటా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మైలవరంలో నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సారధ్యంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గాన్ని విద్యారంగంలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మహాత్మ జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన ఉన్నతమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శవంతమైన పాఠశాలలుగా నిలుస్తాయని ఆకాంక్షించారు. లైఫ్ ట్యాక్స్ రద్దుకు కృతజ్ఞతగా ఆటోలు ట్రాక్టర్లు నిర్వహించిన భారీ ర్యాలీలు ఇరువురు మంత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి తొలుత విద్యాశాఖ ఏర్పాటు చేసిన పైలాన్ ను ఇరువురు మంత్రులు ఆవిష్కరించారు.