యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సంక్షేమ పథకాల అమలులో సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతువు పెన్షన్‌ను రెట్టింపు చేశారు. మహిళలకు పసుపు కుంకుమ-పేరుతో పదివేల రూపాయలిస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలాంటి పథకాలతో, సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూల ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి పెంచుతామని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగ భృతి రూ. 1000 నుంచి రూ. 2000 వరకు పెంచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లోపే నిరుద్యోగ భృతి పెంపును అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరోవైపు ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5శాతం .. మిగిలినవారికి 5శాతం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అంతేకాదు చుక్కల భూముల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్ చిన్న డిపాజిటర్లకు పరిహారం చెల్లింపు.. సెలూన్లకు ఉచిత విద్యుత్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నారు.