YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పరుగులు పెట్టిన సెన్సెక్స్

పరుగులు పెట్టిన సెన్సెక్స్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అంతర్జాతీయ పాజిటివ్ ట్రెండ్, బడ్జెట్‌పై సానుకూల అంచనాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ గురువారం పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు 1.5 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 665 పాయింట్ల (1.87 శాతం) లాభంతో 36,257 పాయింట్లకు ఎగసింది. ఇక నిఫ్టీ 179 పాయింట్ల (1.68 శాతం) పెరుగుదలతో 10,831 పాయింట్లకి చేరింది. నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 3 శాతం పడిపోయింది. అదేసమయంలో యాక్సిస్ బ్యాంక్, గెయిల్, ఇన్ఫోసిస్, టైటాన్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ 4 శాతానికి పైగా ర్యాలీ చేసింది. గెయిల్, ఇన్ఫోసిస్, టైటాన్, టాటా మోటార్స్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. 
సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఒక్క నిఫ్టీ మీడియా మినహా మిగతావన్నీ లాభాల్లోనే ముగిశాయి. దాదాపు అన్ని ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్‌లో రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో దీనికి సంబంధించిన అంశాలు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు పన్ను ప్రయోజనాలు, రైతులకు తోడ్పాటునందించే చర్యలు ఉంటే.. దాని వల్ల వినియోగం పెరుగుతుందని, అలాగే దేశీ పొదుపు కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశీ స్టాక్ మార్కెట్‌కు సానుకూల అంశం. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాల్లోనే కదలాడాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను తటస్థంగా కొనసాగించడం, తదుపరి రేట్ల పెంపు విషయంలో సహనంతో ఉంటామని పేర్కొనడం వల్ల పాజిటివ్ సెంటిమెంట్‌ ఏర్పడింది. హాంగ్ సెంగ్, నికాయ్ ఇండెక్స్‌లు ఒక శాతం మేర పెరిగాయి. అమెరికా మార్కెట్‌లో బుధవారం రాత్రి డౌజోన్స్, ఎస్అండ్‌పీ ఇండెక్స్‌లు 1.5 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటం కూడా దేశీ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. రూపాయి ట్రేడింగ్ ప్రారంభంలో 26 పైసలు బలపడి 70.86 వద్ద కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ పడిపోవడం సానుకూల అంశం. హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్ల జోరు కూడా కలిసొచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరిగాయి. ఈ నాలుగు షేర్లే సెన్సెన్స్‌ను ఏకంగా 320 పాయింట్లమేర పెంచాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 2 నుంచి 3.5 శాతం శ్రేణిలో పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందుకోవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొటోంది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచింది. కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చని ఎస్‌బీఐ అంచనా వేసింది. కేంద్రం జీడీపీలో 3.2 శాతం లేదా రూ.6.72 లక్షల కోట్లను ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్దేశించుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం కూడా కలిసొచ్చింది. బుధవారం రోజు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.130 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వు సరళ విధాన పాలసీ ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది.

Related Posts