యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) షేరు గురువారం కుప్పకూలింది. ఏకంగా 20 శాతం మేర పతనమైంది. రూ.31,000 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలపై కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు సిద్ధమైందనే వార్తలు ఇందుకు కారణం. వరుసగా రెండు రోజులపాటు 20 శాతం వరకూ పడిపోయిన ఈ షేరు తాజాగా మరో 20 శాతం మేర నష్టపోయింది. వివిధ షెల్ కంపెనీల సాయంతో డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ప్రధాన ప్రమోటర్లు రూ.31,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కోబ్రాపోస్ట్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కంపెనీపై వెలువడిన ఆరోపణలను విచారించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం నుంచి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విచారణ అంశంపై స్పందించేందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిరాకరించగా, డీహెచ్ఎఫ్ఎల్ అధికారులు అందుబాటులోకి రాలేదు.
ఈ ప్రతికూల వార్తలతో బీఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేరు దాదాపు 20 శాతం క్షీణించి రూ.129.6 కనిష్టానికి పతనమైంది. ఉదయం 12:53 సమయంలో షేరు ఎన్ఎస్‌ఈలో రూ.139.65 వద్ద ట్రేడవుతోంది. కాగా డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 129.6గా, రూ.690గా ఉన్నాయి.