యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీని వీడతారంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. గురువారం ఢిల్లీలో మాట్లాడిన మేకపాటి.. తనపై వస్తున్న వదంతుల్ని కొట్టిపారేశారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అబద్దాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్పార్‌సీపీ ఆవిర్భావం ముందు నుంచి వైఎస్ జగన్ వెంట నడిచానని.. ఆయనతో కలిసి పనిచేశానని గుర్తు చేశారు మేకపాటి. పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశాననన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేస్తానని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. మీడియా సంస్థలు నైతిక విలువలతో వ్యవహరించాలని.. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఆ సంస్థలకు విలువలు ఉండవని గుర్తు పెట్టుకోవాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆరోపించారు రాజమోహన్ రెడ్డి. ఎన్నికలు రాబోతున్నాయనే తెలిసే హడావిడిగా పింఛన్లు పెంచారని.. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. బాబు నిజస్వరూపం ప్రజలందరికీ తెలుసని.. వచ్చే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విభజన చట్టంలోని హామీలను సాధించపోతే చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు.