YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫిబ్రవరి 11న ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటం ఒకటో తేదీన పెద్దఎత్తున నిరసన

ఫిబ్రవరి 11న ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటం         ఒకటో తేదీన పెద్దఎత్తున నిరసన
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఫిబ్రవరి 11 వ తేదీన ఢిల్లీలో ఒకరోజు ధర్మపోరాట దీక్షకు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్నద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన చేపట్టే ఆందోళనలు ఒక న్యాయమైన కారణం కోసం చేస్తోంది కాబట్టి 5 కోట్ల ప్రజలను భాగస్వాములను చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.   ప్రత్యేక హోదా సాధనకు, విభజన చట్టం అమలుకు కేంద్రంపై అనుసరించాల్సిన వ్యూహం మీద అఖిలపక్షాలు, ప్రజా సంఘాల నేతలతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీకి మేలు చేసే వ్యక్తులకు, పార్టీలకు మద్దతునిస్తే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ఫిబ్రవరి 1వ తేదీనుంచి రాష్ట్ర ప్రజల తరపున నిరసనలు వివిధ రూపాల్లో ఉంటాయని ముఖ్యమంత్రి వివరించారు. 
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు,మేధావులు,ఉద్యోగ,విద్యార్ధి సంఘాల ప్రతినిధులతో  పోరాట కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రానటువంటి పార్టీలను కూడా కలిసి జెఏసిలో చేరాలని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.  అరవై ఏళ్లు మన కష్టాన్ని, స్వేదాన్ని, సృష్టించిన సంపదను హైదరాబాద్‌కు ధారాదత్తం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 9,10 వ షెడ్యూలులో ప్రకటించిన ఆస్తులను వెంటనే న్యాయబద్ధంగా విభజించి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  
హోదా కోసం చేసే ఉద్యమాలకు ఏపి ఎన్ జీవో ల మద్దతు ఉంటుంది. ఢిల్లీలో పోరాటానికి వేలాది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, తామంతా  ముఖ్యమంత్రికి అండగా ఉంటామని,  పోరాటం చేయాలని, రాష్ట్రం హక్కులను సాధించాలని ఏపీ ఎన్జీవో నేత  చంద్రశేఖరరెడ్డి సూచించారు. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ  నేత మురళీకృష్ణ  మాట్లాడుతూ ఫిబ్రవరి 1న సచివాలయ సంఘం తరపున నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యకలాపాల్ని ఆపబోమన్నారు. వచ్చేనెల 11, 12 తేదీలలో చేపట్టే ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఒక ప్రాజెక్టు రావడానికి ఒక విశ్వసనీయత. దానివెనుక ఎంతో శ్రమ ఉంటుందని అన్నారు. హైదరాబాద్ కు ఐ.ఎస్.బి తేవడానికి, మైక్రో సాఫ్ట్ సెంటర్  తేవడానికి పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకున్నారు. కియా మోటార్స్ అనంతపురం తేవడానికి పడ్డ శ్రమను వివరించారు. ఐఎస్ బీ ఈరోజు ఇండియాలో నెంబర్ వన్, వరల్డ్‌లో 24 వ స్థానంలో నిలిచిందంటే ఆరోజు దాన్ని హైదరాబాద్ తీసుకురావడానికి తాను పడిన  శ్రమ గుర్తుకు వస్తోందని చంద్రబాబు అన్నారు.  దక్షిణాది రాష్ట్రాలలో ఐ.ఎస్.బి ఎక్కడ ఏర్పాటు చేయాలో అనే అంశంపై అధ్యయనానికి వచ్చిన కమిటీకి తాను ముఖ్యమంత్రినై ఉండీ, హోదాను పక్కనబెట్టి  సాదరంగా స్వాగతించానని ఆయన చెప్పారు. వారిని ఒప్పించి విజయం సాధించడం వల్లనే ఐ.ఎస్.బి. హైదరాబాద్ లో ఏర్పాటయ్యింది తప్ప మరో కారణం కాదని స్పష్టం చేశారు.కేంద్రం  సహకరించకపోగా, అత్యంత దుర్మార్గంగా  మన పొట్టగొట్టాలని ప్రయత్నిస్తోందని, ఆ హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  అరవై ఏళ్ల కష్టాన్ని, శ్రమను, సృష్టించిన సంపదను వదలివేసి రావాల్సి వచ్చిందని, ఇటువంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. ‘ఏవిధంగానూ ఆదుకోని కేంద్రానికి మేమెందుకు పన్నులు కట్టాలి..? మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు రావాలని,  మన హక్కుల సాధనలో రాజీపడే ప్రసక్తే లేదు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఎక్కడదాకా అయినా వెళ్తాం. పోరాటం చేస్తాం’ అని  ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మిగులు రాష్ట్రాల కంటే  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తున్నామని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘మంచి వృద్ధి రేటు సాధించి మనం బృందంగా విజయం సాధించాం. అందులో నాది బృంద నాయకుడి పాత్ర. ఇది సమష్టి విజయం’ అని ఏపీ సీఎం వివరించారు. హైదరాబాద్  వదిలి రావడానికి ఉద్యోగులకు కొంచెం బాధగా ఉంది కానీ, ఐదేళ్లు ఆగితే అమరావతి హైదరాబాద్ కంటే మిన్నగా తయారవుతుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించామన్నారు. పట్టిసీమ కట్టకపోతే కృష్ణా డెల్టాకు నీళ్లువచ్చేవా..? కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు ఇవ్వకపోతే రాయలసీమకు నీళ్లిచ్చేవాళ్లమా..? ఇవన్నీ సాధించామంటే మన ముందుచూపు, శ్రమశక్తి వల్లే సాధ్యమైంది’  అని  ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీతో అనవసరంగా పెట్టుకున్నాం అనే భయం ఢిల్లీలో రావాలని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలకు తాము చేస్తున్న పోరాటం అర్ధమై వారిలో చైతన్యం రావాలి. ఢిల్లీలో పాలకులు కూడా ఏపీతో ఎందుకు పెట్టుకున్నామా అని చింతించే పరిస్థితి రావాలి. ఆవిధంగా మన ఆందోళన స్వరూపం ఉండాలని చంద్రబాబు చెప్పారు.దేశంలో ఉన్నది  రెండే కూటములు. ఒకటి బిజెపి కూటమి, రెండు బిజెపి వ్యతిరేక కూటమి. ఇక ఫెడరల్ ప్రంట్ కు అవకాశం ఎక్కడ..? అని చంద్రబాబు ప్రశ్నించారు.  బిజెపి వ్యతిరేక కూటమిలో లేరంటే అనుకూల కూటమే కదా? అంటూ ‘నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశానికి ఎందుకని రాలేదు..? ఈ పనులన్నీ ఎవరి మేలు కోసం..? ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం? రేపటి జేఏసికి కూడా ఇప్పుడు రాని పార్టీలను పిలవండి. వారి వైఖరిలో మార్పువస్తే సరి, లేకపోతే ప్రజలే వారి సంగతి చూస్తారు’ అని చంద్రబాబు అన్నారు. 

Related Posts