యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు అధికారులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తితిదే అధికారులను దారికితేవడంలో ప్రభుత్వ పెద్దలకు కొన్ని ఇబ్బందులుంటాయని ఆయన అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో ఇష్టాగోష్టిలో కేఈ మాట్లాడారు. శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకం కోసం సంబంధిత దస్త్రాన్ని సీఎం కార్యాలయానికి పంపి మూడునెలలు అయిందన్నారు. ట్రస్టు బోర్డు నియామకంలో ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించామని.. బోర్డు విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తుందని సీఎంకు వివరించానన్నారు. పెద్ద ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేయకుంటే అనేక సమస్యలు వస్తాయని చెప్పారు. క్లిష్టమైన రెవెన్యూ శాఖ కన్నా దేవాదాయశాఖ కష్టంగా మారిందని.. ఒక్కోసారి ఆ శాఖను వదులుకోవాలని అనిపిస్తుందని కేఈ వ్యాఖ్యానించారు.