యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టడంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. పీసీ అండ్ పీఎన్డీటీ 1994, 1996 చట్టాల అమలు తీరుపై పలు శాఖల ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కూడా లింగ నిర్థారణ పరీక్షా కేంద్రాలపై నిఘా పెట్టామని వైద్య శాఖ అడిషనల్ సెక్రటరీ సావిత్రి వెల్లడించారు. పీసీ అండ్ పీఎన్టీటీ 1994, 1996 చట్టాలను మొదటి సారి అతిక్రమిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా, రెండోసారి తప్పుచేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తామని సావిత్రి హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరపాలని, వివరాలు వెల్లడించాలని కోరిన వారికి, పరీక్షలు చేసి వివరాలు వెల్లడించిన వైద్యులకు మొదటి తప్పుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50,000 జరిమానా, రెండవ సారి తప్పుచేస్తే 5 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానాతో పాటు వైద్య ధృవీకరణ రద్దు చేస్తామని ఆమె వెల్లడించారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉందని ఆమె తెలిపారు. స్త్రీ జననాలు తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి తాలూకా స్థాయిలో ప్రత్యేక నిఘాపెట్టి, దాడులు నిర్వహిస్తామని అడిషనల్ డైరెక్టర్ సావిత్రి వెల్లడించారు. అనుమానిత పరీక్షా కేంద్రాలు,ఆసుపత్రుల్లో దాడులు నిర్వహించడానికి అవసరమైన పోలీసు భద్రత కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సీఐడీ అడిషనల్ ఎస్పీ సరిత స్పష్టం చేశారు. ఏపీలో 90 శాతం బాలికలు వ్యభిచారంలో కూరుకుపోయారంటూ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఆమె ఖండించారు. సరైన సమాచారం లేకుండా కథనాలు రాయడాన్ని ఆమె తప్పుపట్టారు. కొన్ని పత్రికల ఎడిటోరియల్స్ లో కూడా మహిళల వ్యభిచారంపై తప్పుడు వ్యాసాలు రాస్తున్నారని, అలాంటి వారు ఎక్కడి నుంచి సమాచారం సేకరించారో కూడా ప్రచురిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పీసీ అండ్ పీఎన్టీటీ చట్టాలపై ప్రజల్లో ప్రచారం కల్పించాలని పలువురు అధికారులు సూచనలు చేశారు.