YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పీకల్లోతు కష్టాల్లో..

 పీకల్లోతు కష్టాల్లో..

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పత్తి విత్తనాల నుంచి నూనె తీసే మిల్లులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముడిసరకు కొరత, లింటర్‌ దిగుమతులను చైనా నిలిపివేయడం, పొరుగు రాష్ట్రాల నుంచి ముడిసరుకు రవాణా భారం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఏడాదిలో ఐదు నెలలకే ఉత్పత్తిని పరిమితం చేసుకుంటున్నాయి. కొన్ని రోజులపాటు సోయాబీన్‌ గింజలను సైతం ముడిసరకుగా వినియోగించుకుని నష్టాల నుంచి గట్టెక్కాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో సోయాబీన్‌ సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాయి. లింటర్‌ నుంచి సెల్యులోజ్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు గల అవకాశాలను అధ్యయనం చేస్తున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో పత్తి విత్తనాల నుంచి నూనె, ఇతర ఉత్పత్తులు తయారుచేసే మిల్లులు 11 ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో జిన్నింగ్‌ పరిశ్రమ మొత్తం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో పండే పత్తిలో 80 శాతం గుంటూరు పరిసరాల్లోని జిన్నింగ్‌ మిల్లులకు చేరేది. ఇక్కడ పత్తి నుంచి విత్తనాలు వేరు చేసి దూదిని బేళ్లుగా తయారు చేసేవారు. గింజలను నూనె మిల్లులు ముడిసరకుగా పంపేవారు. రాష్ట్ర విభజనకు ముందు ఏటా 20- 22 లక్షల బేళ్లు తయారుచేసే జిన్నింగ్‌ పరిశ్రమ ప్రస్తుతం 10-12 లక్షలకు పరిమితమైంది. తెలంగాణలో జిన్నింగ్‌ పరిశ్రమ వృద్ధి చెందడం, అక్కడి నుంచి పత్తి తీసుకువస్తే రవాణా భారం పెరగడంతో గుంటూరు కేంద్రంగా ఉన్న జిన్నింగ్‌ పరిశ్రమ క్రమంగా మూతపడుతోంది. దీంతో గింజల లభ్యత 50 శాతానికి పడిపోయింది. ఆంధ్రాలోని మిల్లులకు రోజుకు 3000 టన్నులు అవసరంకాగా స్థానికంగా 1500 టన్నుల లభ్యత మాత్రమే ఉంది. ఇందులోనూ 600 టన్నులు నేరుగా కేకు తయారుచేసే పరిశ్రమలు వినియోగించుకుంటుండగా కేవలం 900 టన్నులే నూనె మిల్లులకు రోజువారీగా ఇక్కడ లభిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలంటే టన్నుకు రూ.1000 అదనంగా వెచ్చించాల్సివస్తోందని 90 రోజులు పూర్తిస్థాయిలో, 70 రోజులు సగం సామర్థ్యంతో మిల్లులు పని చేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
 
పత్తి గింజల నుంచి నూనె తీసే క్రమంలో వాటికి అతుక్కుని ఉన్న దూదిని తొలగిస్తారు. దీనినే లింటర్‌ అంటారు. దీనిని ఇప్పటివరకు చైనాకు ఎగుమతి చేసేవారు. అక్కడ దాని నుంచి సెల్యులోజ్‌ తయారుచేసి రక్షణ రంగం, నోట్ల కాగితం తయారీ, మందులు, రంగులు, కాగితపు పరిశ్రమలకు ఉపయోగించేవారు. అయితే ఈ ప్రక్రియలో కాలుష్యం పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా కలప నుంచి సెల్యులోజ్‌ తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో లింటర్‌ దిగుమతులను చైనా నిలిపివేయగా దేశీయంగా 10 శాతమే వినియోగం ఉండడంతో ఏడాది నుంచి ఒక్కో నూనె మిల్లు వద్ద 2 వేల టన్నుల నిల్వలు పేరుకుపోయి రూ.20 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాయి.
 
నష్టాల బాటలో పయనిస్తున్న పత్తి నూనె మిల్లులు తమ మనుగడకు కొత్తదారులు వెదుకుతున్నాయి. ప్రస్తుతం ఉన్న యంత్ర సామగ్రిలో కొద్దిపాటి మార్పులు చేస్తే సోయాబీన్‌ నుంచి నూనె, దాణా, ఇతర ఉత్పత్తుల తయారీకి ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ పంట స్థానికంగా లేకపోవడంతో మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలి. దీనివల్ల క్వింటాకు రూ.120-150 వరకు రవాణాపై అదనపు భారం పడుతోంది. గుంటూరులో ఇప్పటికే మిల్లులో ప్రయోగాత్మకంగా తయారీ మొదలైంది. అయితే స్థానికంగా సోయాబీన్‌ లభిస్తేనే లాభదాయకంగా ఉంటుందని, పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి ఉత్పత్తులు తయారుచేస్తే మార్కెట్లో పోటీపడలేని పరిస్థితి ఉంది. సోయాబీన్‌ వర్షాధారంగా 90 రోజుల్లోపు చేతికివచ్చే పంట. ఖరీఫ్‌కు ముందు సాగు చేయడానికి అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుండడమే కాకుండా అధ్యయనం చేస్తున్నారు. ఏడాదికి సుమారు 4- 5 లక్షల టన్నుల సోయాబీన్‌ గింజలు అవసరమవుతాయని మిల్లు వర్గాల అంచనా. దేశంలో తయారయ్యే మొత్తం సోయా దాణాలో 70 శాతం ఉత్పత్తిని ఏపీ పౌల్ట్రీ పరిశ్రమ వినియోగిస్తోంది. స్థానికంగానే సోయా దాణా తయారైతే అటు పౌల్ట్రీ పరిశ్రమకు కూడా వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు లింటర్‌ నుంచి సెల్యులోజ్‌ తయారీకి గల అవకాశాలను కూడా యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. ఇతర దేశాలకు వెళ్లి అధ్యయనం చేస్తున్నాయి.

Related Posts