YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

70 సీట్ల విషయంలో జగన్ కు క్లారిటీ

 70 సీట్ల విషయంలో జగన్ కు క్లారిటీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వైసీపీ అభ్యర్థులను నిర్ణయించేందుకు జగన్ మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అనేక నియోజవకర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటం, అసంతృప్తి మరింత ఎక్కువగా కన్పిస్తుండటంతో సర్వే ద్వారానే సమస్యలను పరిష్కరించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై జగన్ కు స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు ఉండటం ఒక కారణమైతే, పోటీ కూడా లేకపోవడంతో వీటిని ఫైనల్ చేసే పనిలో పడ్డారు జగన్. తన బస్సు యాత్రకు ముందే అభ్యర్థులను కనీసం వంద స్థానాల్లో ప్రకటించాలన్నది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది.105 స్థానాల్లో మాత్రం అభ్యర్థుల నిర్ణయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కాని, వివిధ సంస్థల ద్వారా కాని మూడు సర్వేలు చేయించారు. ఈ సర్వేలను బట్టే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం తో మరోసారి అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించాలని అధినేత నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి పీకే టీం రెండు బృందాలుగా ఇప్పటికే వెళ్లిందని చెబుతున్నారు.పదిహేను లేదా ఇరవై రోజుల్లో అంటే ఫిబ్రవరి నెలాఖరుకు ఈ సర్వే నివేదికలు జగన్ కు చేరేలా చూడాలని పార్టీ నాయకత్వం పీకే టీం ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు, కొత్త అభ్యర్థి అయితే ఎలా ఉంటుందన్న విషయాలపై పీకే టీం ఈ నూతన సర్వే నిర్వహించనుందని సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరేసి ఇన్ ఛార్జులు ఉండటం, వారి మధ్య సఖ్యత లేకపోవడంతో ఇప్పటికే జగన్ వారిని పిలిపించి బుజ్జగిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్ మరొకరి అధికారంలోకి రాగానే పదవి ఇస్తామని చెబుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన ఆశావహులు కూడా మరోసారి సర్వే చేయించాలని జగన్ ను కోరినట్లు చెబుతున్నారు. ప్రజల్లో బలంగా వెళ్లామని, ఇప్పడు టిక్కెట్ నిరాకరిస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు జగన్ ఎదుటే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే ఫిబ్రవరి నెలాఖరుకు ఈ నియోజకవర్గాలపై స్పష్టత రావాలని జగన్ భావిస్తున్నారు. అందుకోసమే మరోసారి సర్వే చేయించి ధీటైన అభ్యర్థులను, గెలుపు గుర్రాలను ఖారారు చేయాలన్న ఉద్దేశ్యంలో వైసీపీ అధినేత ఉన్నట్లు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మరి చివరి సర్వేలో ఎవరు అదృష్టవంతులో తేలుతుందా?

Related Posts