YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీతో దోస్తీకి శివసేన అడుగులు

బీజేపీతో దోస్తీకి శివసేన అడుగులు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మహారాష్ట్రలో శివసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక బీజేపీతో కలసి పోటీ చేస్తుందా? ఇప్పుడు బంతి ఉద్ధవ్ థాక్రే కోర్టులోనే ఉంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో శివసైనికులందరూ బీజేపీతో పొత్తుపై నిర్ణయాధికారాన్ని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రేకు కట్టబెట్టారు. అయితే ఇప్పటి వరకూ శివసేన భారతీయ జనతా పార్టీకి కాకుండా మోదీ, అమిత్ షాలకు మాత్రమే దూరంగా ఉంటూ వస్తుంది. మహారాష్ట్రలోని ప్రభుత్వంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఇదివరకే ప్రకటించింది. ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఇక పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకూ ఉంది.మహారాష్ట్రంలో అత్యధికంగా 48 పార్లమెంటు స్థానాలున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ ల పొత్తు ఖరారయింది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి, తాము ఒంటరిగా బరిలోకి దిగితే వచ్చే ఫలితాలు ఉప ఎన్నికల్లోనే బీజేపీ, శివసేనలకు తెలిసి వచ్చాయి. దీంతో శివసేన కూడా కమలం పార్టీతో పొత్తుకు దిగిరాక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఈ రెండు పార్టీలు కలిస్తేనే విజయం. లేకుంటే ప్రత్యర్థి గెలుపు సులువవుతుందన్నది అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువ స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకే గత కొన్నాళ్లుగా మోదీ, అమిత్ షాలపై సేన విమర్శలు ప్రారంభించిందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ఎన్నికల్లో మొత్తం 48 స్థానాల్లో బీజీపీ 23, శివసేన 18 స్థానాల్లో విజయం సాధించాయి. ఆ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలంటే ఇద్దరికి ఒకరి సహకారం మరొకరికి అవసరం కూడా. అందుకే ఉద్ధవ్ థాక్రే 30 స్థానాలను డిమాండ్ చేసే అవకాశముందంటున్నారు. ఇప్పటికే థాక్రేతో ఆర్ఎస్ఎస్ కీలక నేతలు భేటీ అయి లోక్ సభ ఎన్నికలపైన చర్చించారని చెబుతున్నారు. ఈ సందర్బంగానే థాక్రే 30 స్థానాలు ఇవ్వాలన్న డిమాండ్ బయటపెట్టారని చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం గతంలో మాదిరిగానే ఒప్పందం ఉంటుందని, చెరి 24 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా తాము సిద్ధమేనన్న సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది.పార్లమెంటు స్థానాలను ఎక్కువగా గెలుచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయవచ్చన్నది శివసేన వ్యూహంగా కన్పిస్తోంది. ప్రస్తుతమున్న బీజేపీ ఉన్న పరిస్థితుల్లో తాము పెట్టే షరతులకు బీజేపీ దిగిరాక తప్పదని థాక్రే అంచనాగా ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ లతో జరిగిన సమావేశంలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరకు శివసేన బీజేపీతోనే కలసి నడిచి వెళుతుందని, లోక్ సభ స్థానాల్లో చెరి సగం సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద థాక్రే ప్రకటన కోసం ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Related Posts