యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ లో కమలనాధులు నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మాటల దాడిని సమర్థంగా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 4వ తేదీ నుంచి కమలనాధులు బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 15 రోజుల పాటు జరగనున్న ఈ బస్సు యాత్ర దాదాపు 85 నియోజకవర్గాలను చుట్టిరానుంది. ఫిబ్రవరి నాల్గో తేదీన పలాసలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో ఆదోనిలో ముగియనుంది.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గత ఆరు నెలల నుంచి కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని బీజేపీ నేతల ఆరోపణ. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాష్ట్రంలో పెద్దయెత్తున దుర్వినియోగం జరిగాయని వారు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలేంటి? అవి రాష్ట్రంలో ఎలా అమలు జరుగుతున్నాయి? పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంతవరకూ చేసిందేమిటి.? కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో జరిగిన తంతు ఏమిటన్న విషయాలను ఈ బస్సుయాత్ర ద్వారా వివరించనున్నారు.ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ నాలుగు అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. కనీసం అదే సంఖ్యలోనైనా ఈసారి ఎన్నికల్లో గెలుచుకుని తీరాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణ బీజేపీ బలంగా ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో కుదేలైపోయింది. కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీకి మోదీ ఏమీ చేయలేదన్న ప్రచారం ఇప్పటికే బలంగా ప్రజల్లోకి వెళ్లడంతో దానిపై జనానికి వివరణ ఇవ్వాలని నిర్ణయించి బస్సు యాత్రను ప్రారంభించనుంది. ప్రతి జిల్లాలో సభ ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. జిల్లాలో జరిగే సభకు విధిగా కేంద్ర మంత్రి ఒకరు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది.ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన గుంటూరులోనూ, 16వ తేదీన విశాఖపట్నంలో జరిగే సభల్లో పాల్గొననున్నారు. నరేంద్ర మోదీ ఇప్పటికే పార్టీ క్యాడర్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ స్వయంగా తాను రాష్ట్రానికి ఏం చేసిందీ ఈ సభల్లో వివరిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీకి భవిష్యత్తులో తాము ఏం చేయబోయేది కూడా తెలియపరుస్తారని వారంటున్నారు. మొత్తం మీద కమలం పార్టీ తుడిచిపెట్టుకుపోయిన ఆంధ్రప్రదేశ్ లో కనీస స్థానాలను గెలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.