YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నితీష్ వారసుడిగా పీకే

నితీష్ వారసుడిగా పీకే
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా అవతరించనున్నారా? భవిష్యత్తులో జనతాదళ్ (యు) పగ్గాలు అందుకోనున్నారా..? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను విజయతీరాలకు చేర్చిన “ప్రశాంత్ కిషోర్ మా పార్టీకి ఆశాకిరణం. మున్ముందు పార్టీ ఏ మార్గంలో ప్రయాణించాలో ఆయన చూసుకుంటారు.” అంటూ 2018 సెప్టంబరు లో నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ప్రశాంత్ తన రాజకీయ వారసుడన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. పార్టీలోకి ప్రశాంత్ కిషోర్ ను ఆహ్వానించినప్పుడు “అతనే మా పార్టీ భవిష్యత్” అని నితీష్ పేర్కొనడాన్ని ఈ కోణంలో చూడక తప్పదు. నితీష్ ప్రస్తుత రాజకీయ, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం వాస్తవం అని అనిపించకమానదు.70 సంవత్సరాల నితీష్ భార్య మంజుకుమారి సిన్హా 2007లో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన ఒంటరి జీవితం గడుపుతున్నారు. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ ది వేరేబాట. రాజకీయాలంటే ఆయనకు పూర్తిగా అనాసక్తి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆసక్తి. ఈ విషయాన్ని బహిరంగంగానే పలుమార్లు స్పష్టీకరించారు. నితీష్ కూడా కుమారుడిపై ఒత్తిడి చేయడం లేదు. ఈ నేపథ్యంలో తనకు రాజకీయంగా చేదోడువాదోడుగా ఉండాలని ప్రశాంత్ కిషోర్ ను కోరుతున్నారు. తద్వారా భవిష్యత్తులో పార్టీ పగ్గాలు ఆయనకు అందించాలన్నది ఆలోచన. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తించారు. “బీహార్ నుంచి నా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని పార్టీలో చేరుతున్న సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. వాస్తవానికి నితీష్ లు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు. నితీష్ వెనకబడిన వర్గాల్లోని “కుర్మీ” తెగకు చెందిన వారు. ప్రశాంత్ కిషోర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. అయినా ఇద్దరూ ఒక్కటి కావడం విశేషం.ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ వారసుడిగా తీర్చి దిద్దే వ్యూహంలో భాగంగా ముందు ఆయనను లోక్ సభకు పోటీ చేయించాలని నితీష్ భావిస్తున్నారు. ఇందుకోసం “బక్సర్” నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇది జిల్లా కేంద్రం. ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులదే ఆధిపత్యం. ప్రస్తుతం బీజేపీకి చెందిన అశ్వనీకుమార్ చౌబే ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ, బీఎస్పీల తర్వాత స్థానంలో జేడీయూ ఉంది. బీజేపీతో పొత్తులో భాగంగా బక్సర్ జేడీయూ కు కేటాయించుకుని ప్రశాంత్ ను బరిలోకి దించాలన్నది నితీష్ వ్యూహం. ఇందులో బక్సర్, బ్రహ్మపూర్, రాజ్ పూర్, దుమ్రాన్, దినారా, రామ్ ఘడ్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆర్జేడీ అభ్యర్థి జగనాధ్ సింగ్ 1.86 లక్షలు, బీఎస్సీ అభ్యర్థి దండన్ యాదవ్ 1.84 లక్షలు, జేడీయూ అభ్యర్థి శ్యామ్ లాల్ కుష్వంత్ 1.17 లక్షల ఓట్లు గత ఎన్నికల్లో సాధించారు. ఇక రాష్ట్ర రాజకీయాల పరంగా చూసినా బ్రాహ్మణ సామాజిక వర్గానికి మంచిపట్టుంది. గతంలో జగన్నాధమిశ్రా, సత్యేంద్ర నారాయణ సిన్హా, భగవత్ ఝా అజాద్, బిందేశ్వర్ డూబే, కేదార్ పాండే, భోలా పశ్వాన్ శాస్త్రి వంటి బ్రాహ్మణులు కీలక భూమిక పోషించారు. ప్రశాంత్ సామాజిక వర్గమైన బ్రాహ్మణులతో పాటు, జేడీయుూ కు చెందిన వెనుకబడిన వర్గం ఓట్లు తోడయితే పార్టీకి ఎదురు ఉండదన్నది నితీష్ ఆలోచన. తొలుత కాంగ్రెస్ వైపు నిలిచిన బ్రాహ్మణులు తర్వాత బీజేపీ వైపు మొగ్గు చూపారు. సామాజిక సమీకరణాలు ప్రశాంత్ కు అనుకూలంగా ఉన్నట్లు నితీష్ అంచనా వేస్తున్నారు. నెమ్మదస్తుడు, విద్యావంతుడు అయిన ప్రశాంత్ పార్టీని సమర్థంగా నడిపించగలరన్న విశ్వాసం ఉంది.ప్రశాంత్ కిషోర్ నేపథ్యం, వ్యవహార శైలి, ఆలోచన విధానంలో స్పష్టత ఉంటుంది. ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. 2011లో రాజీనామా చేసి నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి చేరువయ్యారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ విజయానికి తెరవెనుక విశేష కృషి చేశారు. వ్యూహకర్తగా అన్నీ తానై వ్యవహరించారు. ఈ బంధం బలపడటంతో 2014లోక్ సభ ఎన్నికలకు సయితం మోదీ ఆయన సేవలను వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీచింది. బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. 2015లో మోదీకి అప్పటి రాజకీయ ప్రత్యర్థి అయిన నితీష్ కుమార్ కు దిశానిర్దేశం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లతో ఏర్పడిన మహాకూటమి విజయదుందుభి మోగించింది. దీంతో ప్రశాంత్ పై నితీష్ కు గురికుదిరింది. ఆయనను తన మనిషిగా చూడటం మొదలుపెట్టారు. అనంతరం జరిగిన ఉత్తరప్రదేశ్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ను తప్పుపట్టడానికి అవకాశం లేదు. యూపీలో దశాబ్దాలుగా కాంగ్రెస్ కుదేలైంది. స్వయంగా పార్టీ అధినేతలు రాహుల్,సోనియా గాంధీ, మిత్రుల మద్దతుతో లోక్ సభకు ఎన్నికవుతున్నారు. అలాంటి చోట ఎవరూ చేయగలిగింది ఏమీ ఉండదు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పాత రాష్ట్రం అయినప్పటికీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఓటమి అనివార్యమైంది. అయినప్పటికీ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. దీంతో ప్రశాంత్ లోక్ సభ ఎన్నికల్లో ఎవరి తరుపున పనిచేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. చివరికి ఆయన జేడీయూలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. బీహార్ లోని బక్సర్ జిల్లా ససారంలో జన్మించిన 41 సంవత్సరాల ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో…? ఏ వైపుకు తీసుకుపోనుందో ఈ ఏడాది తేలిపోనుంది.

Related Posts