యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ బలంగా ఉన్న జిల్లాలో ఎలాగైనా…ఈసారైనా అధిక స్థానాలను గెలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థుల కోసం జల్లెడ పడుతున్నారు. ఎన్నికలలో కలసి వచ్చే ప్రతి కీలక అంశాన్ని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. సర్వేలు, సామాజిక వర్గాల ఆధారంగానే ఈసారి అధినేత టిక్కెట్లు కేటాయిస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. అవసరమైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి కూడా చంద్రబాబు వెనకాడరని చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే మొదటి నియోజకవర్గం ఉదయగిరి అన్నది పార్టీలో బలంగా విన్పిస్తుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గాన్ని గెలుచుకున్న టీడీపీ ఈసారి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. ఆయన గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం మైనస్ గా మారింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనూ బొల్లినేని వెనకబడి ఉండటం విశేషం. అయితే ఈయన కమ్మ సామాజిక వర్గానికిచెందిన నేత కావడంతో తనకు ఎలాగైనా టిక్కెట్ ఇస్తారని, జిల్లాలో తమ సామాజికవర్గానికి ఎక్కువ అవకాశాలు లేకపోవడంతో తనకే టిక్కెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు బొల్లినేని రామారావు. అయితే అక్కడ టీడీపీ క్యాడర్ మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం. టిక్కెట్ కోసం కావ్య కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు తమకు మంచి చేసే వారినే ఎన్నుకుంటారన్న పేరుంది. పార్టీలను చూడకుండా వ్యక్తులను చూసి ఓటేస్తారని గతంలో ఫలితాలను చూసినా తెలుస్తోంది. 1978, 1983ల్లో ఇందిర, ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఇక్కడ నుంచి ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నిక కావడమే ఇందుకు నిదర్శనం. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రెడ్లు, కమ్మ వర్గాలదే ఆధిపత్యం. కావ్య కృష్ణారెడ్డి గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కలిగిరి, కొండాపురం, వింజమూరు, జలదంకి మండలాల్లో కావ్యకు మంచిపట్టుంది. ఈయన వైసీపీ నేతలు ఆనం రామనారాయణరెడ్డి, మానుగుంట మహీంధర్ రెడ్డితో సంబంధాలున్నాటీడీపీలోనే కొనసాగుతున్నారు.ప్రత్యేకంగా ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సమస్యను తీరుస్తున్నారు. కొత్తగా పెళ్లిచేసుకునే జంటలకు ట్రస్ట్ ద్వారా పదివేలు ఇస్తున్నారు.ఇలా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో ఆయనకే టిక్కెట్ అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగే అవకాశముంది. గత ఎన్నికలలో మూడు వేల ఆరొందల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయిన మేకపాటి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు. వైసీపీ గాలులు బలంగా వీస్తుండటంతో గెలుపు తనదేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు పార్టీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ఆఫీసర్ అశోక్ బాబు కూడా ఆశిస్తున్నారు. కావ్య కృష్ణారెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని, క్యాస్ట్ ఈక్వేషన్లలో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే అశోక్ బాబుకే ఇస్తారని, సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేనికి సీటు ఇవ్వకూడదన్న నిర్ణయం అధిష్టానం తీసుకున్నదన్న ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.