యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే అధికార దండాన్ని అందుకోవటం.. అంతే వేగంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం మామూలే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు పాలన పడకేసి ఉంటుంది. దీంతో.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాలనను పరుగులు తీయించే పనిలో ప్రభుత్వ సారధి ఉంటారు. విచిత్రమైన విషయం ఏమంటే.. కేసీఆర్ సర్కారు మాత్రం అందుకు భిన్నమైన పద్దతిని అనుసరిస్తున్నారు.
ఎన్నికలు ముగిసి.. ఫలితాలు విడుదలైన యాభై రోజులు దాటినా పాలనా రథం పరుగులు తీయటం ప్రారంభం కాలేదు. దీనికి ముఖ్యకారణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోకపోవటం. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పడిన వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తోంది. ఒకవేళ చేయకుంటే.. బలమైన నేతల అసంతృప్తి సెగ ప్రభుత్వాధినేతకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే.. ఇవన్నీ సంప్రదాయ రాజకీయాల్లోనే. కేసీఆర్ లాంటి అధినేతల హయాంలో అలాంటి పప్పులేం ఉడకవు. తానెప్పుడేం చేయాలో అప్పుడు మాత్రమే చేసే కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం.. సాహసం టీఆర్ఎస్ నేతల్లో ఎవరికీ లేదు. కేసీఆర్ కరుణా వీక్షణాలు తమ మీద పడితే చాలు.. ఈ జన్మకి అనుకునే వారు వేళ.. తనకు తోచినప్పుడే కేబినెట్ కొలువు తీర్చే పరిస్థితి.ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ మంత్రివర్గంలోకి ఎంతమంది మంత్రి పదవులు దక్కుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పూర్తిస్థాయి మంత్రివర్గం ఇప్పుడు కొలువు తీరదని.. మహా అయితే ఆరు లేదంటే ఎనిమిది మందిని మాత్రమే ఆయన ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు ఎంపిక చేసే వారిలో కూడా ముఖ్యమైన శాఖలు భర్తీ చేసేందుకే చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే మంత్రివర్గ విస్తరణ సాధ్యం కావటం ఒకటైతే.. బడ్జెట్ ను పెట్టటానికి ఆర్థికమంత్రి ఒకరు ఉండాల్సిన అవసరం ఉండటంతోనూ మంత్రుల్ని నియమిస్తున్నట్లు చెబుతున్నారు. పంట రుణ మాఫీ.. రైతుబంధు సాయం పెంపు.. అసరా పెన్షన్లు లాంటి వాటికి సంబంధించిన కీలక నిర్ణయాల్ని కేబినెట్ తీసుకోవాల్సి ఉన్నందున మంత్రుల్ని తప్పక నియమించనున్నారు.అదే లేకుంటే.. ఇప్పట్లో మంత్రులకు పదవులు ఇచ్చే వారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఫిబ్రవరి మొదటివారంలో తొలి విస్తరణ.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మలి విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. కేసీఆర్ ఏమనుకుంటే అదే సాగే పరిస్థితి. ఆయన అభిప్రాయాల్ని.. నిర్ణయాల్ని ప్రభావితం చేసే దమ్ము ధైర్యం తెలంగాణలో ఎవరికి లేవని చెప్పక తప్పదు