YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరంపై డీపీఆర్ కు మోక్షం ఎప్పుడు

పోలవరంపై డీపీఆర్ కు మోక్షం ఎప్పుడు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుతెన్నులు చూస్తోంది. మొత్తం ప్రాజెక్టు కొత్త డీపీఆర్ ప్రకారం రూ.54వేల కోట్ల వరకు పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మరో 150 రోజుల్లో ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. జూన్ నాటికి గ్రావిటీపై నీరిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో కొత్త డీపీఆర్ ఆమోదం లభిస్తే లక్ష్యం మేరకు పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నారు. కొత్త డీపీఆర్‌లో లేవనెత్తిన సందేహాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నివృత్తిచేస్తున్నారు. ప్రధానంగా ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు సంబంధించి తలెత్తిన సందేహాలను నివృత్తిచేస్తున్నప్పటికీ ఇంకా డీపీఆర్ ఆమోదానికి నోచుకోలేదు. అడిగిన వివరాలన్నీ డాక్యుమెంట్లతో సహా జల వనరుల శాఖ అధికారులు అందించారు. అన్ని వివరాలను సమర్పించి ఇక కొలిక్కివచ్చినట్టే భావిస్తున్నప్పటికీ ఇంకా కొత్తగా ఏవో వివరాలు అడుగుతూనే ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి డిసెంబర్ నెలాఖరుకు కొత్త డీపీఆర్ ఆమోదం పొంది బయటకొస్తుందని అంతా భావించినప్పటికీ అలాజరగలేదు. కొత్త డీపీఆర్‌లో ప్రధానంగా అన్నీ పనులకూ ఆమోదం లభించినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులు తొలగించినట్టు విశ్వసనీయ సమాచారం. పోలవరం హెడ్ వర్క్సు నిర్మాణ అంచనా సుమారు రూ.42వేల కోట్లకు పెరిగింది. 2010-11లో ఇదే హెడ్ వర్క్సు రూ.9700 కోట్లు అంచనా వుండేది. దీనిని కొత్త డీపీఆర్‌లో సుమారు రూ.39 వేల కోట్లకు కుదించి ఆమోదించినట్టు సమాచారం. కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, పవర్ హౌస్‌తో కలిపి సుమారు రూ.57వేల కోట్ల వరకు అంచనా పెరిగింది. ఇందులో ముఖ్యంగా సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఐకానిక్ వంతెన నిర్మాణ పనులను ప్రతిపాదించారు. ఇది సవరించిన ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం సుమారు రూ.500 కోట్లకు పెరిగింది. అదేవిధంగా ప్రాజెక్టు సందర్శకులకు వౌలిక సదుపాయాలు కల్పించడానికి, పర్యాటకంగా బోటింగ్, కాటేజీలు తదితరాలు నిర్మించడానికి సుమారు రూ.70 కోట్ల విలువైన పనులను కొత్త డీపీఆర్‌లో ప్రతిపాదించారు. ఈ రెండు పనులను కొత్త డీపీఆర్‌లో తొలగించారు. అంటే దాదాపు రూ.570 కోట్ల విలువైన పనులను పీపీఎ అంగీకరించకపోవడంతో తొలగించారు. ఐకానిక్ వంతెన బదులు సాధారణ వంతెన నిర్మించాలని సూచించారు. ఇన్ని పనులను కోత విధించి, మిగిలిన పనులు ఆమోదం పొందినప్పటికీ ఇంకా పరిశీలన నుంచి బయటపడలేదు. ఫిబ్రవరి మొదటి వారంలోనైనా కొత్త డీపీఆర్ ఆమోదం పొందేనా అని ఎదురు చూస్తున్నారు.

Related Posts