యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కియ కార్ల పరిశ్రమ అధ్యక్షుడు, సీఈవో డబ్ల్యు.హెచ్.పార్క్ ఇక దక్షిణకొరియాలో ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కియ ప్లాంటు ట్రయల్‌రన్ కార్యక్రమంలో అనూహ్య ప్రకటన చేశారు. ‘‘దక్షిణకొరియాకు చెందిన మరిన్ని కంపెనీలు, పెట్టుబడుల్ని ఏపీకి తెచ్చేందుకు సహకారం అందిస్తానని పార్క్ నాకు మాటిచ్చారు. కొరియాలో ఏపీకి అతనే బ్రాండ్ అంబాసిడర్’’ అని చెప్పాను. అయితే ఆయన తన మాటను పాక్షికంగా నిలబెట్టుకున్నారని, కొన్ని పరిశ్రమలను తీసుకొచ్చినా, ఇంకా చాలా రావాల్సి ఉన్నదని అన్నారు. ‘‘అందుకే ఆయన్ను అడుగుతున్నా. ఆయనకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే అధికారికంగా అంబాసిడర్‌గా ప్రకటిస్తాను’’ అని సీఎం అనగా, పార్క్ అంగీకరించారు. ఏపీని రెండో ఇల్లుగా చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రపంచ పెట్టుబడిదారులకు పార్క్ పిలుపునిచ్చారు.‘పెట్టుబడులకు దక్షిణ కొరియా తొలి ఇల్లు. ఏపీ రెండో ఇల్లు. ఇక్కడకు వచ్చే కొరియా పెట్టుబడులకు నేను హామీ ఇస్తాను’’ అని పేర్కొన్నారు. ఏపీలో ప్రకృతి సేద్యం చేస్తున్నామని, దీంతో పర్యావరణం బాగుంటుందని సీఎం ఆయనకు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 0.3శాతం మంది ప్రకృతి సేద్యం చేస్తుండగా, భారత్‌లో ఇది 0.6శాతంగా ఉందని, రాష్ట్రంలో మాత్రం ఎనిమిది శాతం మేర సేద్యం చేస్తున్నారని తెలిపారు. ‘‘స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన గాలి, నీరు అందిస్తాం. విద్యుత్, గ్యాస్ దేనికీ కొదవలేదు. ఏది అడిగితే అది కల్పిస్తాం. దక్షిణకొరియా కంటే మెరుగైన జీవన పరిస్థితులను ఇక్కడ కల్పిస్తాం’’ అని సీఎం భరోసా ఇచ్చారు.కియా అధ్యక్షుడు, సీఈవో పార్క్ మాట్లాడుతూ.. ఇక్కడ 536 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ప్లాంట్ ద్వారా ఏటా మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నామన్నారు. ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. భారత్‌లో వాహనరంగంలో విప్లవానికి ఈ పరిశ్రమ దోహదపడుతుందని పేర్కొన్నారు. కియా ఎండీ షిమ్ మాట్లాడుతూ.. సాంకేతికంగా అత్యాధునికమైనది, పర్యావరణపరంగా అనుకూలమైన ప్లాంట్‌ను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. భారతీయులను ఆకట్టుకునేలా మోడళ్లు తీసుకురానున్నామని వివరించారు.ః